బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలు సడలిస్తున్నవేళ.. చైనాలో మాత్రం ఆంక్షలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మళ్లీ కరోనా వైరస్ విజృంభణతో చైనా విలవిలలాడుతోంది.
ఇప్పటికే ఆ దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ అంక్షలు అమలవుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.
అక్కడ నిత్యం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మొన్న ఆదివారం ఒక్కరోజే 13 వేల కేసులు వెలుగు చూశాయి. గడిచిన రెండేళ్ళలో ఇవే గరిష్టంగా చైనా ఆరోగ్య అధికారులు పేర్కొంటున్నారు.
అసలే ఒకపక్క ‘ఒమిక్రాన్’తో ఉక్కిరిబిక్కిరి అవుతోంటే.. తాజాగా అక్కడ ఒమిక్రాన్‌కి సంబంధించిన మరో కొత్త ఉపరకం వైరస్ వెలుగులోకి వచ్చింది. దీంతో చైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు షాక్ తిన్నారు.
గడిచిన శనివారం దేశవ్యాప్తంగా 12 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆదివారం ఒక్కరోజే 13,146 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 70 శాతం కేసులు ఒక్క షాంఘై నగరంలోనే నమోదు కావడం గమనార్హం.
అయితే, ఊరట కలిగించే అంశం ఏమిటంటే.. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ మరణాలు మాత్రం సంభవించలేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది.
కరోనా కేసులు మళ్లీ మొదలవడంతో చైనా అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయో చెంగ్ లోనూ లాక్‌డౌన్ విధించారు. హైనన్ ప్రావిన్స్‌లోని సాన్యా నగరానికి వాహన రాకపోకలపై కూడా నిషేధం విధించారు.
మరోవైపు రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘై నగరంలో కోవిడ్ నిర్థారణ పరీక్షలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి.
కొత్త ‘సబ్ టైప్’ కలవరం …
తాజాగా చైనాలో ఒమిక్రాన్‌కు సంబంధించిన ఓ కొత్త సబ్ టైప్ వైరస్ వెలుగులోకి వచ్చింది. షాంఘై నగరానికి సమీపంలో ఓ కోవిడ్ బాధితుడిలో ఈ కొత్త రకాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
దీనికి ‘ఎక్స్ఈ’ నామకరణం చేశారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన బీఏ 1.1 నుంచి పరివర్తన చెందినట్లు అంచనా వేస్తున్నారు. ఇది రీకాంబినెంట్ స్ట్రెయిన్ అని, ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్లు BA.1, BA.2 ల ఉత్పరివర్తనం అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్ బీఏ.2 కంటే 10 శాతం వేగంగా వ్యాపిస్తోందని, ప్రస్తుతం అమెరికా సహా పలు యూరప్ దేశాల్లో ఈ వేరియంట్ కారణంగానే కొత్త కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
ఈ కొత్త ‘సబ్ టైప్’ వైరస్ వెలుగులోకి రావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తోపాటు అన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇది అంత ప్రమాదకరం కాకపోవచ్చనే అంచనాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి.