పాకిస్తాన్ కీలక నిర్ణయం.. భారత్ నుంచి పంచదార, పత్తి దిగుమతికి అనుమతి

- Advertisement -

ఇస్లామాబాద్: భారత్-పాకిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ మొదలు కానున్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్‌లోని ప్రైవేటు రంగం భారత్ నుంచి పంచదార, పత్తిని దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇరు దేశాల్లోని ప్రైవేటు వాణిజ్య రంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

భారత్-పాకిస్థాన్ మధ్య వివిధ స్థాయిల్లో ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. కశ్మీర్ అంశంపై తాము చర్చల మార్గాన్నే కోరుకుంటున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి నిన్ననే లేఖ రాశారు.

చర్చల ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారానికి అనువైన మార్గం ఏర్పడుతుందని ఇమ్రాన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ రాసిన మరుసటి రోజే పాక్ కీలక నిర్ణయం తీసుకుని భారత ఉత్పత్తుల దిగుమతికి మార్గం క్లియర్ చేసింది.

పాకిస్థాన్ ఇచ్చిన తాజా అనుమతుల ప్రకారం… భారత్ నుంచి 0.5 మిలియన్ టన్నుల పంచదార దిగుమతి చేసుకునేందుకు పాక్‌లోని ప్రైవేటు రంగానికి వెసులుబాటు కలిగింది.

ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో పాక్ వ్యాపారులు ఇప్పటికే భారత్‌లో పంచదార, పత్తి కొనుగోళ్లపై సంప్రదింపులు ప్రారంభించారు. ఇతర దేశాలతో పోల్చితే పత్తి, పంచదార భారత్ లోనే చవక.

రెండేళ్ల క్రితం సంబంధాలు తెంచుకున్న పాక్

2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత ప్రభుత్వం తొలగించిన తర్వాత భారత్‌లోని అన్ని వాణిజ్య సంబంధాలను పాకిస్థాన్ తెంచుకుంది.

ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కాగా అమలు చేస్తోంది. దాంతో దాయాదుల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటాయన్న ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.

- Advertisement -