విజయవాడ: విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రమాణ స్వీకారానికి వరుణుడు ఇబ్బందులు సృష్టించాడు.
బుధవారం అర్థరాత్రి ప్రాంతంలో విజయవాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విజయవాడలోని పలు ప్రాంతాలు, వీధులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి.
ఈ వర్షం కారణంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనూ భారీగా నీరు నిలిచింది. అంతేకాకుండా ప్రమాణ స్వీకారం కోసం నిర్మించిన వేదిక కూడా వర్షానికి తడిసిముద్దైంది.
కూలిపోయిన హోర్డింగులు…
అలాగే గురువారం నాటి ప్రమాణ స్వీకారాన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు బుధవారం అర్థరాత్రి వరకు జగన్ నివాసం ఉన్న తాడేపల్లి నుంచి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వరకు పలు హోర్డింగులు ఏర్పాటు చేశారు. అయితే ఉన్నట్లుండి పడిన భారీ వర్షానికి చాలాచోట్ల ఈ హోర్డింగులు సైతం కూలిపోయాయి.
మరోవైపు జగన్ ప్రమాణ స్వీకారానికి ఎక్కువ సమయం కూడా లేకపోవడంతో సంబంధిత శాఖల అధికారులు రంగంలోకి దిగారు.
యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని వర్షపు నీటిని మోటార్లు ద్వారా బయటకు పంపుతున్నారు. ప్రమాణ స్వీకారం సమయానికి ఇందిరాగాంధీ స్టేడియంను రెడీ చేసే పనిలో వారు ఉన్నారు.
ఒకవేళ అప్పటికీ స్టేడియం అందుబాటులోకి రాకపోతే జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి బందరు రోడ్డును వేదికగా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీనికోసం ముందుగానే అక్కడ స్టేజి ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యే ట్రాలీలను కూడా అధికారులు రప్పించారు.








