హైదరాబాద్: ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీసును హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాదు రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని నిర్ణయించిన విషయం తెలిసిందే.
చదవండి: జగన్ ప్రమాణ స్వీకారానికి వరుణుడి అడ్డంకులు! తడిసి ముద్దయిన వేదిక?
ఈ నేపథ్యంలో కొన్ని పరిపాలన వ్యవహారాల కోసం, అలాగే రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి హైదరాబాద్లో కూడా తనకు క్యాంప్ ఆఫీసు అవసరమని జగన్ భావిస్తున్నారు.
కొంత వెసులుబాటుగా ఉంటుందని…
ఈ విషయాన్ని వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో నోటి మాటగా చెప్పినట్లు సమాచారం. దీంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం క్యాంప్ ఆఫీసును సిద్దం చేయాలంటూ కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
దీనివల్ల ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం కుదురుతుందని, తద్వారా విభజన సమస్యలు త్వరితగతిన పరిష్కరమవుతాయని కూడా కేసీఆర్, జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.
చదవండి: బాబుకు భారీ షాక్: పార్టీనీ వీడే ఆలోచనలో టీడీపీ కీలక నేత?
నిజానికి హైదరాబాద్ నగరం పదేళ్లపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయినప్పటికీ హైదరాబాదును వాడుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. ఆయన పాలనాయంత్రాంగాన్ని అమరావతికి తరలించారు.
అయితే కొత్త ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాను హైదరాబాదు క్యాంప్ ఆఫీసును వాడుకుంటానని, ఏపీకి గతంలో కేటాయించిన సచివాలయంలోని బ్లాకులను వాడుకుంటానని కేసీఆర్కు చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు హైదరాబాదుతో ఆంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఇప్పుడు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని మరింత పటిష్టపరిచేందుకు ఉపయోగపడుతుంది.
చదవండి: ప్రజల దృష్టిలో మేము ఎప్పుడూ ఎమ్మెల్యేలు, మంత్రులమే: పరిటాల శ్రీరామ్
అలాగే హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ అధికారిక యంత్రాంగం కొంత ఉండేలా చూసుకోవాలని కూడా జగన్ భావిస్తున్నారు. దీనివల్ల పెండింగులో ఉన్న విభజన అంశాలను పరిష్కరించుకోవడానికి కొంత వెసులుబాటుగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.
ఏపీకి సంబంధించిన అధికారులు కొందరు ఇక్కడ ఉంటే.. విద్యుత్తు వినియోగం, ఉన్నత విద్య, ఆబ్కారీ విషయాలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తెలంగాణ అధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.








