
హైదరాబాద్: సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బహుశా ఆయన మోడీ కేబినెట్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా గురువారం ప్రమాణం చేసే అవకాశం ఉంది.
గురువారం ఉదయం ఈ మేరకు ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుండి కిషన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చిందని, మంత్రిగా ప్రమాణం చేసేందుకు అందుబాటులో ఉండాలని వారు ఆయనకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
చదవండి: హైదరాబాదులో క్యాంప్ ఆఫీస్‌కు జగన్ యోచన.. సరేనన్న కేసీఆర్!
గత నెల 11వ తేదీన జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి బండారు దత్తాత్రేయ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో ఇక్కడ్నించి కిషన్ రెడ్డి పోటీ చేయాలని భావించినా.. సాధ్యం కాలేదు.
దీంతో చివరి నిమిషంలో కిషన్ రెడ్డి అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. అయితే గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన కిషన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
దత్తాత్రేయ స్థానం నుంచి…
2019 ఎన్నికలకు వచ్చేసరికి వయో భారం కారణంగా ఈ దఫా దత్తాత్రేయకు బీజేపీ టిక్కెట్టును కేటాయించలేదు. దీంతో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి కిషన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి నాలుగు ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతో ఈసారి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించవచ్చనే ప్రచారం ఊపందుకుంది.
చదవండి: జగన్ ప్రమాణ స్వీకారానికి వరుణుడి అడ్డంకులు! తడిసి ముద్దయిన వేదిక?
అనుకున్నట్లుగానే ఆయనకు ప్రస్తుత మోడీ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కబోతోంది. కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రధానితోపాటుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా భావించినట్లు సమాచారం.
మరోవైపు గురువారం రెండోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణం చేయనున్నారు. ఆయన తరువాత మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిలో కిషన్ రెడ్డి కూడా ఉంటారని ఆ పార్టీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.








