ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి!

janardhan-reddy-died-in-australia
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు చెందిన జనార్దన్ రెడ్డి(26) అనే విద్యార్థి ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 11వ తేదీన రోడ్డు ప్రమాదం జరగ్గా, అప్పట్నించి రాయల్ మెల్బోర్న్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనార్దన్ రెడ్డి శనివారం 11 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచాడు.

సిద్ధిపేట జిల్లా గజ్వెల్‌కు చెందిన జనార్దన్ రెడ్డి రెండు నెలల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి సెంట్రల్ క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయంలో అతడు అకౌంటెన్సీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు.

మే 11వ తేదీన తన మిత్రుడు(24)తో కలిసి బైక్‌పై ప్రయాణిస్తూ మలుపు తీసుకోబోయిన ఓ కారును వీరు ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో జనార్ధన్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి మిత్రుడికి కూడా గాయాలు అయ్యాయి.

అయితే జనార్ధన్ రెడ్డి మిత్రుడు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అవగా, జనార్దన్ రెడ్డి మాత్రం అప్పట్నించి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూనే ఉన్నాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…

శుక్రవారం రాత్రి వరకు జనార్ధన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని, శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శ్వాస సంబంధమైన సమస్య తలెత్తిందని, కానీ అంతలోనే అతడు తిరిగిరాని లోకాలకు చేరతాడని అనుకోలేదని జనార్దన్ రెడ్డి అన్న సంజీవ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు.

మరోవైపు జనార్దన్ రెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి ఆస్ట్రేలియాలో సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అతడి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తోంది.

- Advertisement -