ఓ ఎన్నారై దారుణం: తనకు దక్కలేదని సహోద్యోగి ప్రియుడ్ని చంపేశాడు

- Advertisement -

శాన్‌ఫ్రాన్సిస్కో: ఓ ప్రవాస భారతీయుడు అమెరికాలో దారుణానికి ఒడిగట్టాడు. తనతో డేటింగ్‌కు రాలేదన్న అక్కసుతో  ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌ను హత్య చేశాడు.  కాలిఫోర్నియా పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు.. కెవిన్ ప్రసాద్ (31) శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ సేవలందిస్తున్నాడు. అక్కడే ఓ యువతి కూడా పనిచేస్తోంది. ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రసాద్ పలుమార్లు ఆమెను డేటింగ్ కు రమ్మని ఆహ్వానించాడు.

ఆమెకు నగలు కూడా బహూకరించి లోబర్చుకోవాలని చూశాడు. అయితే వాటిని తిరస్కరించిన ఆమె.. తనకు మార్క్ మంగాక్కట్ (31) అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, తమకు మూడేళ్ల బిడ్డ కూడా ఉందని కెవిన్ ప్రసాద్‌కు చెప్పింది. అయినా సరే ప్రసాద్ ఆమె వెంటపడడం మానలేదు.  ఆమెను తనకు దక్కాలంటే ఎలాగైనా ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను మట్టుబెట్టాలని నిశ్చయించుకున్నాడు.

ఈ క్రమంలో తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు తలకు ముసుగు ధరించిన కెవిన్ ప్రసాద్.. మార్క్ మంగాక్కట్ కారు వద్దకు వచ్చి అతడ్ని తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన కాలిఫోర్నియా పోలీసులకు తొలుత నిందితుడి గురించి ఒక్క క్లూ కూడా లభించలేదు.

మరోవైపు హతుడు మార్క్ మంగాక్కట్‌కు ఏ గ్యాంగులతోనూ సంబంధం లేదని తెలిసింది. తమ దర్యాప్తులో భాగంగా మృతుడి గర్ల్‌ఫ్రెండ్, ప్రసాద్ సహోద్యోగిని అయిన యువతిని కూడా పోలీసులు విచారించారు. తనకు కెవిన్ ప్రసాద్‌పై అనుమానం ఉందని, తనను డేటింగ్‌కు రమ్మంటూ అతడు చాలా ఒత్తిడి చేస్తుండేవాడని, తాను నిరాకరించినా వినేవాడుకాదని ఆమె తెలిపింది. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు.

ఈ క్రమంలో ప్రసాద్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడైన డొనోవాన్ మ్యాథ్యూ రివీరా సహాయంతో అతను మార్క్ మంగాక్కట్ ను కాల్చి చంపాడని పోలీసులు తేల్చారు. అతనిపై హత్య కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. నిందితుడు కెవిన్ ప్రసాద్‌కు ఈ నేరం కింద మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -