వాషింగ్టన్/న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న భారతీయులు 2017లో భారత దేశానికి పంపిన మొత్తం ఎంతో తెలుసా? 69 బిలియన్ డాలర్లు..అంటే సుమారు రూ.4.50 లక్షల కోట్లు. అవును, ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు తాజాగా వెల్లడించింది. ఈ విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్ అగ్రస్థానంలో ఉందట.
జీవనోపాధి కోసం విదేశాల్లో పని చేస్తున్న భారత సంతతి వ్యక్తులు తాము సంపాదించిన దాంట్లో తమ కుటుంబాలు, సన్నిహితులకు డబ్బులు పంపిస్తారు. ఇక్కడ తమ వారు జీవనం సాగించేందుకు లేదా పెట్టుబడులు పెట్టేందుకు ఈ నిధులు ఉఫయోగిస్తుంటారు.
ఇలా విదేశాల నుంచి భారత్‌కు 2017లో వచ్చిన మొత్తం 69 బిలియన్ డాలర్లు. 2016లో రూ.4.08 లక్షల కోట్లు వస్తే 2017లో 9.9 శాతం పెరిగింది. అయితే 2014లో 70.4 బిలియన్ డాలర్ల కంటే తక్కువేనని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. 2015తో పోలిస్తే 2016లో 8.8 శాతం తగ్గింది. 2016తో పోలిస్తే 2017లో నగదు బదిలీ అంచనాలకు మించి పెరిగేందుకు ఐరోపా, రష్యా, అమెరికాల వృద్ధే కారణమని నివేదిక తెలిపింది. ఇంధన ధరల పెరుగుదల, యూరో, రూబుల్ బలపడటం ఉపకరించాయని పేర్కొంది.