అమెరికాలో మరో తెలుగుతేజం.. మిర్యాలగూడ వాసికి అత్యంత అరుదైన గౌరవం

- Advertisement -

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన జొన్నలగడ్డ ప్రవీణ్ (45)కు అమెరికాలో అత్యంత అరుదైన గౌరవం లభించింది. వైర్‌లెస్, కమ్యూనికేషన్ సంస్థ కామ్‌స్కోప్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐవో)గా నియమితులయ్యారు.

సంస్థలోని 50 మంది సాంకేతిక నిపుణుల్లో ఆయన ముఖ్యుడిగా ఉండడంతోనే ఈ గౌరవం లభించింది. ప్రవీణ్ గత పుష్కరకాలంగా కామ్‌స్కోప్‌లోనే వివిధ హోదాల్లో పనిచేశారు. డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంటి హోదాల్లో సేవలు అందించారు.

మిర్యాలగూడ మండలంలోని గూడూరుకు చెందిన రంగారెడ్డి, విమలాదేవి దంపతుల కుమారుడే ప్రవీణ్. ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే సాగింది. మిర్యాలగూడ ఎయిడెడ్ కళాశాలలో బీఎస్సీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు.

2001లో అదే యూనివర్సిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత వివిధ సంస్థల్లో పనిచేసిన ప్రవీణ్ 12 ఏళ్ల క్రితం కామ్‌స్కోప్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు ఆ సంస్థకు సీఐవోగా నియమితులయ్యారు.

కామ్‌స్కోప్‌కు సీఐవోగా నియమితులవడంపై ప్రవీణ్ స్పందిస్తూ.. తన శ్రమకు తగిన గుర్తింపు లభించిందన్నారు.

- Advertisement -