తప్పు చేస్తున్నామని తెలిసే చేశారు: అరెస్టైన భారతీయ విద్యార్థులపై అమెరికా, సరికాదన్న భారత్

us fraud uv
- Advertisement -

న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికాలో నకిలీ యూనివర్సిటీలో చేరి అరెస్టైన విద్యార్థులందరికీ తాము చేస్తున్న పని తప్పని తెలుసని, పూర్తి అవగాహనతోనే చేశారని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికాలో భారత విద్యార్థుల అరెస్టుపై ప్రభుత్వం ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి అభ్యంతర పత్రం(డెమార్ష్‌) జారీ చేయడంపై అక్కడి ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది.

అమెరికాకు చెందిన ఓ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘నకిలీ యూనివర్సిటీ విషయంలో అరెస్టయిన విద్యార్థులందరికీ తప్పు చేస్తున్నామన్న విషయం ముందే తెలుసు. ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయంలో బోధనా వ్యవస్థ లేదన్న విషయం కూడా వారికి తెలుసు. అక్రమంగా అమెరికాలో ఉండాలనే ఉద్దేశంతోనే వారు అలా చేశారు’ అని ఆరోపించారు.

ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విద్యార్థులను కలవడానికి భారత దౌత్య అధికారులను అనుమతించాలని కోరింది. దళారులను, విద్యార్థులను ఒకేలాగా చూడొద్దని తెలిపింది. అంతేగాక, విద్యార్థులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరింది.

విద్యార్థులకు తెలియదని ఇమ్మిగ్రేషన్ అధికారులు వివరించినా..

విద్యార్థులను బలవంతంగా అక్కడి నుంచి పంపొద్దని తెలిపింది. అలాగే భారత రాయబార కార్యాలయంలో 24గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. అలాగే ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయం నకిలీదని భారత విద్యార్థులకు తెలియదని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి వివరించడం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో అరెస్టైన భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థి వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నవారిని పట్టుకోవాలనే ఉద్దేశంతో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని సృష్టించారు. అందులో భాగంగా 8 మంది దళారులను, వారి ద్వారా చేరిన 130 మంది విద్యార్థులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫార్మింగ్‌టన్‌ వర్సిటీ మాత్రం తమకు జాతీయ గుర్తింపు ఉందని, ఆన్‌లైన్‌ తరగతులు కూడా అందుబాటులో ఉన్నాయని ప్రకటించుకోవడం గమనార్హం.

చదవండి: వీసా స్కాం: 30 మంది తెలుగు విద్యార్థుల విడుదల, భారత ఎంబసీ ముమ్మర యత్నాలు…

- Advertisement -