శ్రుతిహాసన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ ఫిర్యాదు

- Advertisement -

కోయంబత్తూరు: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ కుమార్తె, ప్రముఖ సినీనటి శ్రుతిహాసన్‌పై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నిన్న పోలింగ్ జరగ్గా కమల్ తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్‌లతో కలిసి చెన్నైలో ఓటు వేశారు. అనంతరం కమల్ తాను పోటీ చేస్తున్న కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గానికి వెళ్లారు.

ఈ క్రమంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అయితే, తండ్రి వెంటనే కుమార్తె శ్రుతిహాసన్ కూడా పోలింగ్ కేంద్రంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

పోలింగ్ కేంద్రంలోకి అక్రమంగా ప్రవేశించిన ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వసతి శ్రీనివాసన్ తరపున బీజేపీ జిల్లా అధ్యక్షుడు నందకుమార్ జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాశారు.

పోలింగ్ కేంద్రంలోకి బూత్ ఏజెంట్లు తప్ప మరెవరూ వెళ్లకూడదనే నిబంధన ఉందని, దీనిని ఉల్లంఘించిన శ్రుతిహాసన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

- Advertisement -