పే అండ్ స్టే వీసా స్కాం: అమెరికాలో మన విద్యార్థుల పరిస్థితి ఏంటి? భారత ప్రభుత్వం ఏం చేస్తోంది?

pay and stay scam
- Advertisement -

న్యూఢిల్లీ: అమెరికాలో పే అండ్ స్టే వీసా స్కాంలో అరెస్టయిన భారతీయ విద్యార్థుల కేసును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం జైళ్లలో ఉన్న విద్యార్థులను బయటికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఆయా జైళ్లలో ఉన్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

అసలేమిటీ వీసా స్కాం?

నకిలీ సర్టిఫికెట్ల ద్వారా అమెరికన్ యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొందుతున్న విదేశీ విద్యార్థులను కనిపెట్టడానికి అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు.. యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ అనే నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియక.. ఆ యూనివర్సిటీలో తప్పుడు వివరాలు, నకిలీ సర్టిఫికెట్లతో పలువురు విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరిలో భారతీయ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. దీంతో అక్కడి అధికారులు ఇలా తప్పుడు వివరాలు, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి అడ్మిషన్ పొందిన విదేశీ విద్యార్థులను ఉన్నట్లుండి అరెస్టు చేశారు.

36 జైళ్లలో విద్యార్థులు…

అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత నెల అంటే.. జనవరి 31 వరకు 130 మంది విదేశీ విద్యార్థులను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. వారిలో 129 మంది భారతీయ విద్యార్థులే కావడం విచారించాల్సిన విషయం. వీరందరినీ ఒక జైలులో కాకుండా.. 36 జైళ్లలో పెట్టారు.

భారత ప్రభుత్వం ఏం చేస్తోందంటే…

ఇండియన్ ఎంబసీ, కాన్సులేట్ల ద్వారా 36 జైళ్లలో ఉన్న 117 మంది విద్యార్థులను కలుసుకుని.. వారికి కాన్సులర్ సేవలను అందిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు తెలియజేశారు.

ప్రతి విద్యార్థికి న్యాయ నిపుణుల ద్వారా సలహాలు, సూచనలను అందిస్తున్నామని, అలాగే మిగిలిన విద్యార్థుల వివరాలను కూడా కనుక్కునే పనిలో నిమగ్నమయ్యామని, వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఇప్పటికే ఇండియన్ ఎంబసీ ద్వారా 24 గంటల హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామని, జైళ్లలో ఉన్న భారతీయ విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురవట్లేదనే విషయాన్ని నిర్దారించుకోడానికి భారత ప్రభుత్వం నిత్యం అమెరికాలోని స్థానిక, ఫెడరల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగశాఖ ప్రకటించింది.

తెలుగు సంఘాలు కూడా…

మరోవైపు భారతదేశానికి చెందిన అమెరికాలోని వివిధ సంఘాలు కూడా విద్యార్థులకు నిత్యం అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నాయి. అమెరికాలోని తెలుగు సంఘాలు జైళ్లలో నిర్బంధించిన విద్యార్థులను బయటకు తీసుకురావడానికి ఐక్యంగా నిరంతరం పనిచేస్తున్నాయి.

న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతూ ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నాయి. అమెరికాలో ఉండటానికి అనర్హులైన విద్యార్థులను జాగ్రత్తగా తిరిగి భారత్‌కు పంపించేందుకు కృషి చేస్తున్నాయి.

- Advertisement -