మిస్సోరి: అమెరికాలోని కాన్సాస్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి శరత్ కొప్పు(26) బలయ్యాడు. దుండగుడు అయిదు రౌండ్ల కాల్పులు జరపడంతో శరత్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు.
వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన శరత్ తండ్రి రామ్మోహన్. హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి మాలతి వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్నారు. రామ్మోహన్ కుటుంబం హైదరాబాద్ అమీర్‌పేటలోని ధరమ్‌కరమ్ రోడ్డులో నివసిస్తోంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె. శరత్ హైదరాబాదులోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ చేశాడు. హైదరాబాద్‌లోనే మూడేళ్లపాటు ఉద్యోగం కూడా చేశాడు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు.
ఆరు నెలల క్రితమే అమెరికాకు…
శరత్ ఆరు నెలల క్రితమే మిస్సోరి విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్ నగరం ప్రాస్పెక్ట్స్ అవెన్యూలోని ఓ రెస్టారెంటులో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడని తెలుస్తోంది. జూలై 7న అక్కడ శరత్‌పై కాల్పులు జరిగాయని, అతడి పరిస్థితి విషమంగా ఉందంటూ అతడి స్నేహితుడొకరు స్వదేశంలోని బంధువులకు తెలిపాడు. మరోవైపు అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో శరత్ కొప్పు అనే విద్యార్థి మరణించినట్లు తెలంగాణ పోలీసులు కూడా నిర్ధారణ చేసినట్లు శరత్ బాబాయ్ ప్రసాద్ వెల్లడించారు.
శరత్‌ని కాల్చి చంపిన అనుమానితుడి ఫుటేజీని కాన్సాస్ పోలీసులు విడుదల చేశారు. హంతకుడి కోసం వేటను ప్రారంభించారు. శరత్ మృతదేహాన్ని భారత్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూచిభొట్లను చంపిన ప్రదేశానికి 26 మైళ్ల దూరంలోనే శరత్ హత్య జరిగింది. శరత్ హత్యపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
బిల్లు కట్టమని అడిగినందుకు…
బిల్లు కట్టమని శరత్ అడగడంతో దుండగుడు కాల్పులు జరిపాడని తెలుస్తోంది. దుండగుడు శరత్ పనిచేస్తోన్న రెస్టారెంటులో భుజించాడు. 30 డాలర్ల బిల్లు అయిందని చెప్పగా శరత్‌ను కాల్చి చంపేసినట్లు తెలుస్తోంది. తమ కుమారుడిపై కాల్పులు జరిగిన విషయం తెలిసి శరత్ తల్లిదండ్రులు సమాచారం కోసం తెలంగాణ డీజీపీని కలిశారు. ఆ తర్వాత అమెరికా అధికారులు శరత్ మృతిని నిర్ధారించి తెలంగాణ పోలీసులకు చెప్పారు. వారు శరత్ బంధువులకు చెప్పారు.