
వాషింగ్టన్: హెచ్-1బీ వీసా దరఖాస్తులు అధికంగా వస్తుండడంతో దీనికి సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసి వలసదారుల సంఖ్యను తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తకొత్త నిబంధనలు తీసుకొస్తూ వలసదారులను కలవరపరుస్తోంది. తాజాగా మరో కొత్త నిబంధన తీసుకురావడంతో హెచ్-1బీ వీసా జారీ మరింత కష్టంగా మారింది.
కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా జారీకి సంబంధించి తీసుకొస్తున్న కఠినమైన నిబంధనలతో అమెరికాలో నివాసముంటున్న హెచ్-1బీ వీసాదారులు ఆందోళనతో రోజులు గడపాల్సి వస్తోంది. కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నవారు అది వస్తుందో రాదో అనే అపనమ్మకంతో ఎదురుచూడాల్సి వస్తోంది.
తాజా నిబంధన ప్రకారం…
హెచ్-1బీ వీసా ఆమోదం, పొడిగింపు కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే దరఖాస్తుదారుడికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తిరస్కరించే అధికారం యూఎస్‌ఐఎస్ అధికారులకు ఉంది. ఇకమీదట ఈ వీసా జారీ ప్రధానంగా అధికారుల విచక్షణపై ఆధారపడి ఉంది. దరఖాస్తును ఎందుకు తిరస్కరించారనే కారణాలను కూడా దరఖాస్తుదారుడికి తెలియజేయాల్సిన అవసరం లేదు.
ఇక హెచ్-1బీ వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరణకు గురైతే దరఖాస్తుదారుడు దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అయితే అర్హతలు ఉన్నా దరఖాస్తు తిరస్కరణకు గురైందని భావిస్తే మాత్రం దరఖాస్తుదారుడు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. భారతీయ ఐటీ ఉద్యోగులు, దేశీయ ఐటీ కంపెనీలపై ప్రభావం చూపనున్న ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి రానుంది.








