అవి స్వాతంత్ర పోరాట రోజులు.. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర స్ఫూర్తితో రగిలిపోతున్న రోజులు .. బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి.. రకరకాల మార్గాల్లో అంటే కొందరు మితవాదుల్లా , కొందరు అతివాదుల్లా విడిపోయి పోరాడుతున్నారు. వీరిలో మితవాదులు ..గాంధీజీ మార్గంలో..అతివాదులు సుభాష్ చంద్ర బోస్ మార్గంలో కదం తొక్కుతూ కదనరంగంలో దూసుకుపోతున్నారు..
ఈ సమయంలో గాంధీజీ తన సందేశాన్ని వినిపించాలి అంటే.. అప్పుడు సోషల్ మీడియా లేదు. వార్తా పత్రికలే దిక్కుగా ఉండేవి. అవి కూడా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉండేవి. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి చెన్నై ఆనాటి మదరాసు రాష్ట్రంలో ఎక్కువగా తెలుగు పత్రికలు ఉండేవి. అలాంటివాటిలో ఆంధ్రపత్రిక ముఖ్యమైనది.. ఈ పత్రిక మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం చేరాలంటే.. ఒకరోజు ఆలస్యంగా వచ్చేది.. కొన్ని ప్రాంతాలకు సాయంత్రానికి చేరేది.. అప్పుడు అందులో గాంధీజీ ఇచ్చిన సందేశం చూసి ప్రజలు ఆ ప్రకారం సిద్ధమయ్యేవారు..
ఉదాహరణకి ఉప్పు సత్యాగ్రహం చేయాలి అని గాంధీజీ చెబితే వెంటనే తెలిసేది కాదు.. ఫోన్లు కూడా సరిగ్గా ఉండేవి కావు.. అంతా టెలిగ్రామ్ వ్యవస్థే పని చేసేది.. అలాగే ఆరోజుల్లో చదువుకునే వారు తక్కువే.. ఎందుకంటే అందరు స్కూళ్ళు,కాలేజీలకు వెళ్ళేవాళ్ళు కాదు.. అంతా స్వాతంత్ర పోరాట దీక్షలో ఎరోజు ఏమి చేయాలి ?అనే అంశం పైనే చర్చలు జరిగేవి ..అల్లాగే పెద్దలు తీసుకునే నిర్ణయాలపై వాదోపవాదాలు జరిగేవి.. ఇప్పుడవి పేర్లు మార్చి టీవీల్లో చేస్తున్నారు. గాంధీజీ సందేశాలను పల్లెలకు వెళ్లి చదువుకున్న వాళ్ళు చెప్పేవాళ్ళు ..ఇలా ఫలానా రోజున ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నారు..అందరు సిద్ధంగా ఉండండి అని..
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటె.. ఆ రోజులకి ఈ రోజులకి సమాచారం ఎంత వేగవంతమయింది చెప్పడానికి..
మొన్న మొన్నటి వరకు కూడా సోషల్ మీడియా రానంతకాలం పత్రికల పైనే ఆధార పడేవారు.. అందులో వచ్చినదే వార్త.. ప్రజల సమస్య ఉంటె వారు పత్రిక విలేఖరులకి చెప్పి .. వారు దయతలిచి రాస్తే వార్త వచ్చేది.. మరిప్పుడా అవసరమే లేదు ..
ఎందుకంటే కాలం మారింది .. సోషల్ మీడియా రోజులు వచ్చేశాయి.. ఎవరైనా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు..
ముఖ్యంగా పత్రికల్లో, టీవీల్లో వార్తలకు ఎవరు భయపడటం లేదు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే మాత్రం ఎంత ఈగో ఉన్నా.. పది మెట్లు దిగి వచ్చి ఎంత గొప్ప వారైనా వివరణలు ఇస్తున్నారు. అంటే సోషల్ మీడియా ప్రభావం ఎంత బలోపేతమైందో అర్థమవుతోంది..ప్రతి వ్యవస్థలో మంచి చెడు రెండు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ గురించి రాస్తే ఇదే మాట అంటారు .. మీడియా గురించి చెప్పినా ఇదే మాట.. పాలిటిషియన్స్ , టీచర్స్,లాయర్లు ఈ వర్గంలో చూసినా మంచి-చెడు రెండు ఉంటాయి. అలాగే సోషల్ మీడియా లో కూడా మంచి-చేడు రెండు ఉన్నాయి .. రేపు భవిష్యత్ సోషల్ మీడియాదే.. రేపు జరగబోయే ఎన్నికలు కూడా ముఖాముఖీ ఉండవు .. సోషల్ మీడియా వార్ గానే మారబోతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ..