కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’: ఒకవైపు రష్యాపై అనుమానాలు.. మరోవైపు ఆయా దేశాల ఆర్డర్లు!

russia says 20 countries have pre ordered for corona vaccine sputnik v
- Advertisement -

మాస్కో: ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ అంటూ ఇటీవల రష్యా విడుదల చేసిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్‌ సామర్థ్యంపై ఒకవైపు అనుమానాలు వ్యక్తమవుతున్నా.. మరోవైపు ఆయా దేశాల నుంచి ఆర్డర్లు మాత్రం ఆగడం లేదు.

రష్యాకు చెందిన ‘ది గమలేయా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్’ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ కోసం పలు దేశాలు క్యూ కడుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే దాదాపు బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్ కోసం 20 దేశాలు ముందస్తు ఆర్డర్లు చేశాయంటూ ఈ వ్యాక్సిన్‌కు నిధులు సమకూర్చుతోన్న రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థ అధిపతి కిరిల్ దిమిత్రియేవ్ వెల్లడించారు.

మరోవైపు ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి అనేక అనుమానాలూ లేకపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను విమర్శిస్తున్నారు.

థర్డ్ ఫేజ్‌ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకుండానే వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి ఎలా తీసుకువస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్‌ డేటా ఇంకా విడుదలే చేయలేదని వారు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో రష్యా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ సురక్షితమైనదని ఎలా నమ్ముతామని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం.. ఈ వ్యాక్సిన్‌ మొదటి, రెండవ దశ క్లినికల్ ట్రయల్స్‌ సత్ఫలితాలు ఇచ్చాయని, థర్డ్‌ ఫేజ్ ట్రయల్‌లో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను‌ తన కుమార్తెపైనే ప్రయోగించినట్లు తెలిపారు.

అంతేకాదు, ఈ వ్యాక్సిన్ కచ్చితంగా కరోనా వైరస్‌ను తరిమి కొడుతుందని, రెండేళ్ల వరకు కరోనా వైరస్‌ దరిచేరదని ధీమా వ్యకం చేస్తున్నారు. 

అయితే పుతిన్ మాటలపై ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం తర్జనభర్జనలు సాగుతున్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు ఇది ఒక బాధ్యతారహితమైన నిర్ణయమని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న తరువాత ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయన్న దానిపై ఇంకా సరైన అధ్యయనం జరగలేదని,  వ్యాక్సిన్‌ వేసుకున్న తరువాత కరోనా వస్తే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాదు, సరిగా పరీక్షించని వ్యాక్సిన్‌ను కోట్లాది ప్రజలపై ప్రయోగించడం అనైతికమని కూడా వారు పేర్కొంటున్నారు.

వ్యా‍క్సిన్ హ్యూమన్ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను, సేఫ్టీ డేటాను అమెరికా, యూరప్‌తో పాటు ఇతర దేశాలకూ అందజేయాల్సి ఉంటుందని, అప్పుడే రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’కి లైసెన్సు‌ లభిస్తుందని అంటున్నారు.

ఇదిలా వుండగా ఇప్పటికే రష్యా వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు క్యూలు కడుతూ, బిలియన్‌ డాలర్ల డోసులకు ఆర్డర్లు‌ ఇస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ బుధవారం నుంచి రష్యా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 

అనంతరం సెప్టెంబర్ నుంచి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని భారీ స్థాయిలో చేపట్టనున్నట్లు, విదేశీ భాగస్వాములతో కలిసి ఏడాదికి 500 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను మొత్తం ఐదు దేశాల్లో ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.  

- Advertisement -