వైఎస్సార్, కేసీఆర్‌లో ఎవరు బెస్ట్ సీఎం?: ట్విట్టర్‌లో కేటీఆర్‌కు క్లిష్ట ప్రశ్న!

ktr-twitter
- Advertisement -

ktr-twitterహైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఓ క్లిష్ట ప్రశ్న ఎదురైంది.  అదీ ఆయన అభిమానుల నుంచి. విషయం ఏమిటంటే.. మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ట్వీట్టర్ ద్వారా ఆయన దృష్టికి వచ్చే చాలా సమస్యలను కేటీఆర్ పరిష్కరించారు కూడా.

ఆదివారం ఆయన ట్విట్టర్‌ ద్వారా లైవ్‌లో తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెబుతూ వారిని ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఓ ఫాలోవర్.. ‘‘కేసీఆర్, వైఎస్సార్‌ లలో ఎవరు బెస్ట్ సీఎం?’’ అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ చాలా తెలివిగా సమాధానం చెప్పారు. ఎవరినీ నొప్పించకుండా.. ‘‘సమాధానం మీకు‌ తెలుసు..’’ అంటూ బదులిచ్చారు. దీంతో, మిగతా ఫాలోవర్లు ‘‘ఇంకెవరూ కేసీఆరే..’’ అంటూ వారికి తెలిసిన సమాధానాలు వారు చెప్పేశారు.

ఏపీలో పోటీ… 

2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు పోటీ చేయాలని మేం కోరుకుంటున్నాం అనే కామెంట్‌కు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ.. ‘‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?..’’ అని సమాధానమిచ్చారు. ‘‘ఇటీవల కొందరిని నగర బహిష్కరణ చేశారు.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటీ? అంటూ ఓ ఫాలోవర్ ప్రశ్నించగా.. కేటీఆర్ బదులిస్తూ.. ‘‘శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..’’ అని అన్నారు.

‘‘మీరు తమిళనాడు సీఎం కావాలి’’.. 

ఓ ఫాలోవర్ మాట్లాడుతూ.. ‘‘నేను మీ వీరాభిమానిని. మీరు తమిళనాడుకు ముఖ్యమంత్రి అవ్వాలి..’’ అనగా.. కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘అది అంత సులువు కాదు..’’ అని తెలిపారు. ‘‘సర్ మీరు అమ్మాయిలకు రిప్లై ఇవ్వడం లేదు..’’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నాకంత ధైర్యం ఉందా?’’ అని సరదాగా వ్యాఖ్యానించారు కేటీఆర్.  ఇలా ఆదివారం  తన ఫాలోవర్లతో ట్విట్టర్‌లో ఓ గంటకు పైగానే ఆయన ముచ్చటించారు.

 

- Advertisement -