చరిత్ర సృష్టించి అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగొస్తున్న స్పేస్‌ఎక్స్ ‘క్రూడ్రాగన్’.. క్షేమంగా దిగుతుందా?

spacex-crew-dragon-is-on-the-way-to-earth-from-iss
- Advertisement -

వాషింగ్టన్: మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష ప్రయోగాల సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ చరిత్ర సృష్టించింది.

రెండు నెలల క్రితం తన వ్యోమనౌక ద్వారా ‘క్రూడ్రాగన్’ క్యాప్సూల్‌లో నాసాకు చెందిన వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు పంపిన ఈ సంస్థ తిరిగి ఇప్పుడు అదే క్యాప్సూల్‌లో వారిని భూమ్మీదికి తీసుకొస్తోంది. 

అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7:35 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ నుంచి విడిపోయిన ‘క్రూడ్రాగన్’ వ్యోమగాములను తీసుకుని భూమి దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

అంతరిక్షంలో దాదాపు 19 గంటల ప్రయాణం తరువాత ఆదివారం ఫ్లోరిడాలోని పెన్సకోలా తీరంలో స్పేస్‌ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూడ్రాగన్ భూమ్మీద ల్యాండ్ అవనుంది. 

దీనికోసం నాసా, స్పేఎస్‌ఎక్స్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా.. వ్యోమగాములు క్షేమంగా భూమ్మీదికి చేరుకోవడానికి అనువుగా ఉండే ఐదు ప్రాంతాలను ఎంపిక చేశారు. 

ఇదో సరికొత్త అధ్యాయం…

మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో ప్రైవేటు కంపెనీ ‘స్పేస్‌ఎక్స్’ సరికొత్త అధ్యాయం లిఖించింది. మే 30న నాసాకు చెందిన వ్యోమగాములు బాబ్ బెంఖెన్, డగ్ హార్లీలు ఈ సంస్థ నిర్మించిన ‘క్రూడ్రాగన్’ క్యాప్సూల్‌లో రోదసీలోకి వెళ్లారు. 

తన వ్యోమనౌక ద్వారా స్పేస్‌ఎక్స్ వీరిని క్షేమంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేర్చింది. దాదాపు రెండు నెలలపాటు వారు ఐఎస్ఎస్‌లో గడిపి తిరిగి శనివారం భూమ్మీదికి ప్రయాణమయ్యారు. 

వ్యోమగాములతోపాటు…

ఈ ఇద్దరు వ్యోమగాములతోపాటు 150 కిలోల బరువును కూడా ‘క్రూడ్రాగన్’ క్యాప్సూల్ మోసుకోస్తోంది. ఇందులో ఎక్కువగా బయోలాజికల్ శాంపిల్స్, పరిశోధనలకు సంబంధించిన కాగితాలు ఉన్నాయి.

2011లో అప్పటి వ్యోమగాములు వదిలి వచ్చిన అమెరికా జాతీయ జెండాను కూడా క్రూడ్రాగన్ తీసుకొస్తోంది. ఈ జెండాను వాణిజ్య అంతరిక్ష యాత్ర లక్ష్యానికి గుర్తుగా అప్పట్లో వారు ఐఎస్ఎస్‌లో వదిలిపెట్టి వచ్చారు.

అంతేకాదు, 2019లో ప్రయోగాత్మకంగా పంపిన క్రూడ్రాగన్ డెమో-1 తీసుకెళ్లిన ‘ఎర్తీ’ అనే బొమ్మను కూడా ప్రస్తుత క్రూడ్రాగన్ తీసుకొస్తోంది. 

అలాగే తాజా యాత్రలో ‘జీరో-జీ ఇండికేటర్’గా ఉపయోగించిన డైనోసార్ బొమ్మను కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు. 

క్రూడ్రాగన్ రోదసీ ప్రయోగంలో మనోడు… 

స్పేస్ఎక్స్‌ క్రూడ్రాగన్ వ్యోమనౌక రోదసీ ప్రయోగంలో ఓ భారత ఇంజినీర్ ప్రముఖ పాత్ర పోషించారు. చెన్నైకి చెందిన బలరామమూర్తి 9 ఏళ్లుగా స్పేస్ఎక్స్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. 

మానవసహిత యాత్ర సామర్థ్యమున్న వాహకనౌక అభివృద్ధిలో బలరామమూర్తి భాగస్వామ్యం కూడా ఉంది. క్రూడ్రాగన్ ప్రయోగంలో ఆయన చీఫ్ ఇంజినీర్‌గా వ్యవహరించారు. 

‘క్రూడ్రాగన్’ క్షేమంగా దిగుతుందా?

ప్రస్తుతం స్పేస్ఎక్స్‌ ‘క్రూడ్రాగన్’ క్యాప్సూల్ అంతరిక్షం నుంచి భూమి దిశగా దూసుకొస్తోంది. అయితే ఇది దిగాల్సిన ఫ్లోరిడాలో ప్రస్తుతం ప్రతికూల వాతావరణం నెలకొంది. 

ప్రస్తుతం అక్కడ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ క్రూడ్రాగన్ భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయానికి ఫ్లోరిడాలో అనుకూల వాతావరణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

ఒకవేళ అప్పటికి వాతావరణం అనుకూలించనట్లయితే.. క్రూడ్రాగన్ ల్యాండింగ్ ప్రక్రియను వాయిదా వేయాలని నాసా శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు.

ఆందోళన చెందవలసిన అవసరం లేదని, మరో మూడు రోజులపాటు వ్యోమగాములకు అవసరమైన అన్ని వసతులు ‘క్రూడ్రాగన్’లో ఉన్నాయని వారు వెల్లడించారు. 

 

- Advertisement -