కరోనాతో టీమిండియా క్రికెటర్లకు విచిత్రమైన పరిస్థితి! ‘విరుష్క’ జంటకు 150 రోజులు తప్పని ఎడబాటు!!

virat-kohli-and-anushka-sharma
- Advertisement -

ముంబై: టీమిండియా క్రికెటర్లను కరోనా వైరస్ విచిత్రమైన పరిస్థితిలోకి నెట్టింది. మామూలుగా అయితే ఏడాది పొడవునా క్రికెట్ మ్యాచ్‌లు ఉండేవి. 

దీంతో క్రికెటర్లకు తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు పెద్దగా సమయం లభించేది కాదు. అయితే ప్రస్తుతం కరోనా కాలం కావడంతో దాదాపు నాలుగు నెలలుగా క్రికెటర్లందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు.

మరోవైపు ఇన్నాళ్లూ ఐపీఎల్ 2020 జరుగుతుందో లేదో అనే సందేహాలు ఉండేవి. అయితే టీ20 ప్రపంచ కప్ వాయిదా పడడంతో ఆ తరువాత పరిణామాలు చకచకా మారిపోయాయి. 

సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 లేదా 10వ తేదీ వరకు ఐపీఎల్ లీగ్‌ను నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ చేసిన ప్రకటనతో ఇటు క్రికెటర్లలోనూ అటు క్రికెట్ అభిమానులలోనూ ఆనందం వెల్లివిరిసింది.

అయితే ఐపీఎల్ 2020 లీగ్‌లో అత్యుత్తమమైన ఆట తీరును ప్రదర్శించాలంటే క్రికెటర్లు మళ్లీ తమ ఫిట్‌నెస్‌ కోసం కష్టపడాల్సిందే. కనీసం ఆరు వారాలు వారు కఠిన సాధన చేయాల్సి ఉంటుంది.

దీనికోసం ముందుగానే ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసే ఫిట్‌నెస్ క్యాంప్‌లకు హాజరుకావాల్సిందే. ఈ నేపథ్యంలో మన టీమిండియా క్రికెటర్లందరూ దాదాపు ఆగస్టు నెల మధ్యలో దుబాయ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

ఇక దుబాయ్ చేరుకున్న తర్వాత కూడా క్రికెటర్లందరూ బయో సెక్యూర్ వాతావరణంలో ఉంటారు.

కరోనా విజృంభిస్తోన్న తరుణంలో ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజీ పడే ప్రసక్తే ఉండదని ఇప్పటికే బీసీసీఐ ఛీఫ్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లను కలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులను కూడా అనుమతించకపోవచ్చు. 

ఒకవేళ అనుమతించినా 10-15 రోజుల కన్నా ఎక్కువ వారితో కలిసి ఉండే అవకాశం ఉండదంటున్నారు. కుటుంబ సభ్యులను సైతం కలవనివ్వడం సురక్షితం కాదని భావిస్తే.. అసలు మొత్తానికే ఎవరినీ అనుమతించకపోవచ్చు.

ఐపీఎల్ ముగిసేవరకు.. అంటే నవంబర్ 10 వరకు టీమిండియా క్రికెటర్లు దుబాయ్‌లోనే ఉంటారు. ఆ తరువాత అట్నుంచటే ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంటుంది. 

అస్ట్రేలియా వెళ్లిన తరువాత కూడా కనీసం ఒకటి రెండు వారాలు క్రికెటర్లందరూ క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని సమాచారం. అయితే వారి ఫిట్‌నెస్, ప్రాక్టీస్‌లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చెబుతోంది.

ఆస్ట్రేలియాతో టీమిండియాకు తొలి టెస్టు డిసెంబర్ 3న మొదలవుతుంది. ఈ టెస్టు సిరీస్ ముగిసిన తరువాత జనవరి 12-17 వరకు వన్డే సిరీస్ ఆడాల్సి ఉంటుంది.

మొత్తంమ్మీద ఆస్ట్రేలియాలో టీమిండియా ఆటగాళ్ల పర్యటన దాదాపు 68 రోజులు ఉంటుంది.

అంటే.. ఆగస్టు నెల మధ్య నుంచి జనవరి వరకు అంటే.. దాదాపు 150 రోజులు టీమిండియా ఆటగాళ్లు భార్యా పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలన్నమాట.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ-అనుష్క ధోనీ-సాక్షి, రోహిత్-రితిక సహా అనేక జంటలకు దాదాపు ఐదు నెలల ఎడబాటు తప్పదన్నమాట!

 

 

 

 

- Advertisement -