కరోనా దెబ్బకు విలవిల.. కిరాణా షాపు పెట్టుకున్న తమిళ సూపర్‌హిట్ దర్శకుడు

- Advertisement -

చెన్నై: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ దెబ్బకు ప్రముఖులు కూడా విలవిల్లాడుతున్నారు. పొట్ట కూటికోసం ఏదో ఒకపని చేసుకుంటూ బతుకున్న సెలబ్రిటీల గురించి ఇటీవల తరచూ వార్తలు వస్తున్నాయి. తాజాగా, తమిళంలో పలు సూపర్‌హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఆనంద్ చెన్నైలో తాజాగా కిరాణా షాపు పెట్టుకుని జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు.

‘ఓరు మజాయ్ నాంగు సారాల్’ , మౌనా మజాయ్’ వంటి సూపర్ హిట్ సినిమాలను ఆనంద్ తెరకెక్కించాడు. ఇప్పుడు కిరాణా దుకాణం పెట్టుకుని బతుకు బండి లాగిస్తున్నాడు. కరోనా భయం, లాక్‌డౌన్ కారణంగా చిత్రసీమ తెరచుకోకపోవడంతో మరో మార్గం లేక చిన్న కిరాణా షాపు పెట్టుకున్నాడు.

చెన్నైలోని మౌలివాక్కంలో ఓ స్నేహితుడికి చెందిన గదిని అద్దెకు తీసుకుని అందులో షాపు పెట్టుకున్నాడు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ నిత్యావసరాలకు ప్రభుత్వ అనుమతి ఉండడంతో ఆనంద్ కిరణా షాపు పెట్టుకున్నాడు. కాగా, ఆనంద్ ప్రస్తుతం ‘తునింతు సీ’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, కరోనా కారణంగా సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

ఆనంద్ సినీ రంగంలోకి ప్రవేశించి పదేళ్లు అయింది. వచ్చే ఏడాది వరకు సినిమా హాళ్లు తెరుచునే అవకాశం లేదని, అందుకనే తాను కిరాణా షాపును ఎంచుకున్నట్టు ఈ సందర్భంగా ఆనంద్ పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యానని, అయితే, లాక్‌డౌన్ సమయంలో కిరణా, ప్రొవిజన్ షాపులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో తాను కూడా షాపు తెరవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

నూనెలు, పప్పులు, బియ్యం సహా నిత్యావసరాలన్నింటినీ విక్రయిస్తున్నట్టు చెప్పాడు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు తక్కువ ధరకే విక్రయిస్తున్నానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని దర్శకుడు ఆనంద్ తెలిపాడు.

- Advertisement -