షాకింగ్: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మ‌ృతి! స్నేహితుడిని రక్షించబోయి…

two-indian-students-drowned-in-turner-falls-of-oklahoma
- Advertisement -

టెక్సాస్: అమెరికాలోని ఓ జలపాతం వద్ద స్నానం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధులు మరణించారు. నెల్లూరు జిల్లా న్యూమిలటరీ కాలనీకి చెందిన కేదార్‌నాథ్ రెడ్డి, టెక్కేమిట్ట ప్రాంతానికి చెందిన ఓలేటి తేజా కౌశిక్‌లు మంగళవారం సెలవు కావడంతో ఓక్లహామాలోని టర్నర్ ఫాల్స్‌ వద్దకు వెళ్లారు.

13 అడుగుల లోతున్న ఆ జలపాతం వద్ద వీరు స్నానం చేస్తుండగా కౌశిక్ ప్రమాదవశాత్తూ నీట మునిగాడు. అతడ్ని కాపాడేందుకు కేదార్‌నాథ్ రెడ్డితోపాటు అక్కడే ఉన్న మరో విద్యార్థి.. రాయచూరుకు చెందిన కోయలమూడి అజయ్ కుమార్ ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో అజయ్ కుమార్ కూడా నీటిలో మునిగి గల్లంతయ్యాడు.

చదవండి: అమెరికాలో మరోమారు గర్జించిన తుపాకి.. ఐదుగురి మృతి

ఈ మేరకు సమాచారం అందడంతో.. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఓక్లా డావిస్ పోలీసులు ఆ జలపాతం మధ్యలో పది అడుగుల లోతున ఉన్న ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. విద్యార్థులు ఇద్దరూ లైఫ్ జాకెట్లు ధరించి లేరని పోలీసులు పేర్కొన్నారు.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి…

మృతుడు ఓలేటి తేజా కౌశిక్(22) స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి కాగా.. ఆయన తండ్రి ఉద్యోగ రీత్యా నెల్లూరులో ఉంటున్నారు. కౌశిక్ బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చదివేందుకు ఏడాది క్రితమే అమెరికాలోని అర్లింగ్‌టన్‌లో ఉన్న టెక్సాస్ యూనివర్సిటీలో చేరాడు.

ఇక మరో మృతుడు రాయచూర్‌కు చెందిన మరో విద్యార్ధి అజయ్ కోయిలమూడి(23)ది ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా. అయితే వీరి కుటుంబం 40 ఏళ్ల క్రితమే కర్ణాటక రాష్ట్రంలోని సింధనూరులో స్థిరపడింది.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తమ కుమారుల హఠాన్మరణంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి మృతదేహాలను భారతదేశానికి తరలించేందుకు ‘తానా’ ప్రతినిధుల సహకారంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గత నెలలో కూడా ఇదే జలపాతం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటనలో కూడా ఇద్దరు భారతీయ విద్యార్థులు స్నానం చేయడానికి వచ్చి ఇలాగే నీట మునిగి మరణించారు. వారూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

చదవండి: అమెరికాలో కాల్పుల ఉన్మాదం.. ఓహియోలో 9 మంది, టెక్సాస్‌లో 20 మంది మృతి..
- Advertisement -