న్యూయార్క్/హైదరాబాద్: అమెరికా కాన్సాస్‌లోని ఓ రెస్టారెంట్‌లో వరంగల్ జిల్లాకు చెందిన శరత్ కొప్పు అనే విద్యార్థి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానిక రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న శరత్ బిల్లు అడిగిన పాపానికి ఓ దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. ఈ కేసులో నిందితుడు తాజాగా పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు.
మిస్సోరీ యూనివర్శిటీలో చదువుకుంటూనే కన్సాస్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే కాల్పుల ఘటన చోటుచేసుకుంది. రెస్టారెంట్‌కు వచ్చిన నిందితుడు ఆహారం ఆర్డర్ చేశాడు. దానికి శరత్ బిల్లు అడగటంతో డబ్బులు చెల్లించకపోగా.. క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బును కూడా దోచుకునేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి అఘాయిత్యాన్నిఅడ్డుకున్న శరత్‌ను.. సదరు దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు.
నిందితుడి కాల్చివేత…
శరత్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆచూకీని కాన్సాస్ పోలీసులు ఆదివారం గుర్తించారు. నిందితుడిపై నిఘా పెట్టిన ఇద్దరు అండర్‌కవర్ ఆఫీసర్స్ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. నిందితుడు వారిపై కూడా కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించగా అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు చనిపోయినట్లు ఆ తరువాత అమెరికా అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై కన్సాస్‌లోని భారత అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. శరత్ మృతికి న్యాయం జరిగిందని పేర్కొంది. శరత్ కొప్పు అమెరికా కాలమానం ప్రకారం.. జులై 6న హత్యకు గురయ్యాడు. వరంగల్‌కు చెందిన శరత్ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసి ఆరు నెలల కిందటే ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లాడు.
నల్లజాతీయుల ఆందోళన…
అయితే శరత్ హత్య కేసులో నిందితుడ్నిపోలీసులు కాల్చి చంపడంపై అమెరికాలో నల్లజాతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నేరం రుజువు కాకుండానే ఎలా చంపుతారంటూ వారు ఆందోళన చేపట్టారు. నిందితుడు నల్లజాతీయుడు కాబట్టే పోలీసులు హతమార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.