సిద్దిపేట: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై 50 వేల మెజార్టీతో తాను విజయం సాధిస్తానని కాంగ్రెసు నేత, అదే నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గజ్వెల్‌లో కేసీఆర్ పై కాంగ్రెసు నేత వంటేరు ప్రతాపరెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే.
శుక్రవారం పోలింగ్ అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేశారని ఆరోపించారు. నాలుగున్నర ఏళ్లలో కేసీఆర్ తెలంగాణను నాశనం చేసి వదిలిపెట్టారంటూ విమర్శించారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం ఈ నెల 11న వస్తుందని ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అంతేకాదు, హైదరాబాద్‌లో నాలుగేళ్లుగా మూతపడ్డ సచివాలయాన్ని మళ్లీ తెరిపిస్తామని ఆయన అన్నారు. గజ్వేల్ ప్రజలు చైతన్యవంతులని, నిజమైన ప్రజాస్వామ్యానికే వారు పట్టం కడతారని, ఆ దిశగానే తమ ఓట్లు వేశారని చెప్పారు. ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన నాలుగేళ్లలో తెలంగాణ సంపదను దోచుకున్న వారి భరతం పడతామని కూడా వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు.