చెన్నై: తమిళనాడులో తండ్రీ కూతుళ్లైన సీనియర్ నటుడు విజయకుమార్, ఆయన కుమార్తె నటి వనితల మధ్య ఇంటి వివాదం ఆసక్తి రేపుతోంది. సాక్షాత్తు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన కుమార్తె, నటి వనితను శుక్రవారం మధురవాయిల్ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. సీనియర్ నటుడు విజయకుమార్‌కు స్థానిక ఆలపాక్కం, అష్టలక్ష్మీ నగర్ 19వ వీధిలో పెద్ద బంగ్లా ఉంది. దాన్ని ఆయన షూటింగ్‌లకు అద్దెకు ఇస్తుంటారు. ఈ క్రమంలో విజయకుమార్ కుమార్తె, నటి వనిత ఆ మధ్య షూటింగ్ నిమిత్తం అనుమతి కోరి.. తరువాత ఆ ఇంట్లోనే ఉండిపోయింది.
దీంతో విజయకుమార్ అ ఇంట్లో నుండి వనితను ఖాళీ చేయించాలంటూ మధురవాయిల్ పొలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనితను అరెస్ట్ చేయడానికి ఆ ఇంటికి వెళ్లారు. అయితే పోలీసులతో వనిత వాగ్వాదానికి దిగి.. అ తరువాత అక్కడి నుంచి పరారైంది.
అనంతరం ఆమె ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆమెను ఆ ఇంట్లో ఉండడాన్ని ఎవరూ అడ్డుకోరాదని, అవసరమైతే వనితకు పోలీసులు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయకుమార్ కుమార్తె వనిత గురువారం మళ్లీ ఆ ఇంట్లోకి చేరింది.
అయితే ఆమె తండ్రి ఊరుకోలేదు. మళ్లీ శుక్రవారం మధురవాయిల్ పోలీసులకు వనితపై ఫిర్యాదు చేశారు. ఆమెను తన ఇంటి నుంచి ఖాళీ చేయించాల్సిందిగా ఆ ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు వనిత ఉంటున్న ఇంటికి మళ్లీ వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కూడా వనిత మళ్ళీ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అయినప్పటికీ ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. ఆ ఇంటి నుంచి రహస్య ప్రాంతానికి తరలించి.. విచారణ జరుపుతున్నారు.