హైదరాబాద్: సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తెలుగు ప్రావీణ్యంతో అల్లుడు నారా లోకేశ్‌ను మించిపోయారనే కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. సాధారణంగా ఎవరైనా మరణింస్తే.. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు.. కానీ బాలకృష్ణ మాత్రం తన అన్న హరికృష్ణ మరణంతో సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడట..
ఇది ఆయన నోట నుంచి వచ్చిన మాటే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది.
తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యంగా ఫ్యామిలీ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కూకట్‌పల్లి స్థానాన్ని దివంగత నేత హరికృష్ణ కుమార్తె సహాసినికి కేటాయించిన సంగతి తెలిసిందే. శనివారం సుహాసిని నామినేషన్ వేసేముందు తాత, తండ్రి సమాధుల వద్ద నివాళులర్పించి అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకం కూడా చేశారు.
బావ చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన బాలయ్య.. తన అన్న కూతుర్ని గెలిపించేందుకు నడుంబిగించారు.
సంబర ఆశ్చర్యాల్లో ముంచెత్తింది…
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఓ తప్పులో కాలేశారు…. ‘ఆయన(హరికృష్ణ) అకాల మరణం అందరిని కూడా సంబర ఆశ్చర్యాల్లో ముంచెత్తింది..’ అని వ్యాఖ్యానించారు. ఇంకేముంది నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లతో బాలకృష్ణను ఓ ఆట ఆడుకుంటున్నారు.
‘ఎయ్ మళ్లి ఏసేశాడు.. మరణిస్తే సంభ్రమాశ్చర్యం ఏంటి నాయనా’ అని ఒకరు.. కనీసం ఆ పదం కూడా సరిగ్గా పలకకుండా ‘సంబర ఆశ్చర్యం’ అని పలకడం ఏంటని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు.
‘తెలుగు భాషను ఖూనీ చేయడంలో అల్లుడు లోకేశ్‌ను మించిపోయిండుపో..’ అని ఇంకొకరు సెటైర్ వేస్తున్నారు. ఇక ఈ సందర్భంగానే మహాకూటమి తరపున బరిలోకి దిగుతున్న సుహాసినిని కూటమి గురించి అడిగితే ఇలా చెప్పాలంటూ మీడియా ముందే బాలకృష్ణ సూచించడంపై కూడా జోకులు పేలుతున్నాయి. గతంలో కూడా బాలకృష్ణ ఇదే తరహాలో మాట్లాడి విమర్శలపాలైన విషయం తెలిసిందే.