న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కారం పొడితో దాడికి దిగాడు ఓ దుండగుడు. సాక్షాత్తూ సచివాలయంలోనే ఈ దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అనిల్ కుమార్ అనే వ్యక్తి సిగరేట్ ప్యాకెట్లో కారం పొడి నింపుకొని ఢిల్లీ సచివాలయంలోకి దూసుకొచ్చారు. భోజనం సమయం కావడంతో ముఖ్యమంత్రి తన గది నుంచి బయటికి వస్తుండగా ఆయనపై ఆ కారంపొడి చల్లాడు.
దీంతో అప్రమత్తమైన సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు. అయినా సరే అనిల్ కుమార్ ‘‘కేజ్రీవాల్‌ను చంపేస్తా..’’ అని గట్టిగా అరుస్తూ సీఎం వైపు పరుగెత్తాడు. ఈ ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కేజ్రీవాల్ కళ్లజోడు కిందపడి పగిలిపోయింది. అక్కడి భద్రతా సిబ్బంది అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఈ ఘటనపై ఆమ్ఆద్మీ తీవ్రంగా మండిపడింది. ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రికే భద్రత లేకుండా పోయిందంటూ ట్వీట్ చేసింది. ముఖ్యమంత్రిపై ఘోరమైన దాడి జరిగింది. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందా? లేదా? అన్నది ఇంకా తేలలేదనీ.. పూర్తి వివరాలు తెలియకుండా తాము ఎవరిపైనా ఆరోపణలు చేయబోమంటూ ఆ పార్టీ నేత ఒకరు పేర్కొనడం గమనార్హం.