

ఇస్లామాబాద్: ఒక్కసారి యుద్ధమంటూ మొదలైతే అది ఎక్కడికి వెళుతుందో తెలియదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఒక్కసారి యుద్ధం మొదలైతే తన చేతుల్లో గానీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల్లో గానీ ఉండదని వ్యాఖ్యానించారు. బుధవారం పాక్ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.
పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలుసార్లు భారత్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ‘మా భూభాగంలోకి మీరు వచ్చారు.. మీ భూభాగంలోకి మేం వచ్చాం’ అని భారత వాయుసేన దాడి, అందుకు పాక్ బుధవారం చేపట్టిన దాడులను ప్రస్తావించారు. పుల్వామా, ఇతర అంశాలపై భారత్‌తో తాము చర్చకు సిద్ధమని, కూర్చుని మాట్లాడుకుందామని అన్నారు.
‘పుల్వామా దాడి తర్వాత భారత్ ఎంత బాధపడిందో మేం అర్థం చేసుకోగలం. గత పదేళ్లలో నేను ఎన్నో ఆస్పత్రులకు వెళ్లి బాంబు దాడి కారణంగా గాయపడిన వారిని కలుసుకున్నాను. కొందరు కాళ్లు, చేతులు, కళ్లు పోగొట్టుకుని ఎంతో క్షోభను అనుభవిస్తున్నారు. బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అని ఇమ్రాన్ తెలిపారు.
విచారణకు సహకరిస్తాం, చర్చలకు సిద్ధం
‘పుల్వామా ఘటన విషయంలో విచారణ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. విచారణకు పూర్తిగా సహకరిస్తాం. ఇరు దేశాల మధ్య ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకూడదనే మేం కోరుకుంటాం. సమస్యకు యుద్ధం పరిష్కారం కాదు. సావధానంగా కూర్చొని చర్చించుకుందాం’ అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
‘గతంలో జరిగిన యుద్ధాలన్నీ అవగాహనలేమి కారణంగానే జరిగాయి. యుద్ధాన్ని మొదలు పెడితే అది ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలియదు. పరిస్థితులు చేజారితే అది నా చేతుల్లో కానీ మోడీ చేతుల్లో కాని ఉండదు. భారత్‌ను చర్చలకు రావాల్సిందిగా మేం ఆహ్వానిస్తున్నాం’ అని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
నియంత్రణ రేఖను దాటి పాక్ భూభాగంలోకి వచ్చిన భారత్‌కు చెందిన రెండు మిగ్ విమానాలను కూల్చివేశామని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు సద్దుమణగాలంటే అందుకు శాంతిపూర్వక చర్చలే సమాధానమని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
చదవండి: మా అదుపులోనే ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు: పాక్, వీడియో రిలీజ్, ఒక పైలట్ అదృశ్యమంటూ భారత్








