

సూర్యాపేట: జిల్లాలోని కోదాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు వెళ్లిన నలుగురు డిప్లొమా విద్యార్థులు పట్టణ శివారులోని పెద్ద చెరువులో పడి మృతి చెందారు. నలుగురు విద్యార్థులు మృతి చెందడంతో కోదాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అనురాగ్ కళాశాలకు చెందిన 20 మంది డిప్లొమా విద్యార్థులు చక్రాల ప్రవీణ్ అనే విద్యార్థి పుట్టిన రోజు జరుపుకొనేందుకు పెద్ద చెరువు కట్టపై ఉన్న వీరభద్ర ఆలయం వద్దకు వెళ్లారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అనంతరం భోజనం చేసి చేతులు కడుక్కునేందుకు సమీర్ అనే విద్యార్థి చెరువులోకి వెళ్లి చేతులు కడుక్కుంటుండగా కాలు జారి పడిపోయాడు.
ఒకరిని కాపాడేందుకు వెళ్లి…
కాపాడాలంటూ సమీర్ కేకలు వేయడంతో చక్రాల ప్రవీణ్‌తో పాటు భవానీ ప్రసాద్, మహేందర్ సింహ, ప్రవీణ్, ఆసిఫ్, అరవింద్, శ్రీను వరుసగా అతడిని కాపాడేందుకు వెళ్లారు. వీరిలో నలుగురు సమీర్(20), చక్రాల ప్రవీణ్(20), భవానీ ప్రసాద్(20), మహేందర్ సింహ(20) లోతులోకి వెళ్లడంతో గల్లంతయ్యారు.
మిగిలిన నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. విద్యార్థుల కేకలు విన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఆర్డీవో కిశోర్‌కుమార్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాఘవపురం నుంచి గజ ఈతగాళ్లను పిలిపించారు. వారితో గాలింపు చేపట్టి నలుగురి మృత దేహాలను వెలికి తీశారు.
పోలీసులు మృత దేహాలను కోదాడ ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. మృతుల్లో భవానీప్రసాద్, చక్రాల ప్రవీణ్‌లు హుజూర్‌నగర్‌కి చెందినవారు, సమీర్ నేరుడుచర్ల, మహేందర్ సింహ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాయనంపల్లి గ్రామస్థుడిగా పోలీసులు గుర్తించారు. పుట్టిన రోజు వేడుకలు ఆనందంగా జరుపుకున్న విద్యార్థులు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.








