23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం స్వదేశానికి చేరుకున్న అభినందన్: వీరుడికి ఘనస్వాగతం, గర్వపడే క్షణమన్న మోడీ

స్వదేశానికి చేరుకున్న అభినందన్: వీరుడికి ఘనస్వాగతం, గర్వపడే క్షణమన్న మోడీ

abhinandhan varthaman
- Advertisement -

Abhinandan-Varthaman
అమృత్‌సర్‌: పాకిస్థాన్ అదుపులో ఉన్న భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్ శుక్రవారం సాయంత్రం  వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఆయనకు వైమానికదళ ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.

అభినందన్ రాకతో వాఘా సరిహద్దు జైహింద్‌, భారత్‌ మాతాకీ జై నినాదాలతో మార్మోగాయి. జాతీయ జెండాలను పట్టుకుని ప్రజలు ఘనస్వాగతం పలికారు. వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది. భద్రతా దళాల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు.

గర్వపడే క్షణమంటూ మోడీ

దాయాది దేశం నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న అభినందన్ వర్థమాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఇది భారతీయులంతా గర్వపడే క్షణమని ప్రధాని వ్యాఖ్యానించారు. అభినందన్‌ రాకతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకొంటున్నారు.

ఫిబ్రవరి 14న పుల్వామాలో జైషే ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40మందికిపైగా సీఆర్పీఎప్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతికారంగా మంగళవారం(ఫిబ్రవరి 26న) తెల్లవారుజామున భారత్ వైమానిక దళం మెరుపుదాడులు చేసి పాకిస్థాన్‌లోని మూడు కీలక ఉగ్రస్థావరాలను పూర్తిగా నాశనం చేసింది. ఈ దాడిలో 350మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, తమ భూభాగంలో దాడులు చేయడంపై పాక్ సీరియస్ అయ్యింది. బుధవారం పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చి బాంబులు వేశాయి. దీంతో భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి.

కాగా, భారత్‌ గగనతంలోకి చొచ్చుకొచ్చిన పాక్ విమానాలను తరిమికొట్టే క్రమంలో మిగ్ విమానం పాక్ సరిహద్దులో కూలిపోయింది. దీంతో అందులో ఉన్న అభినందన్ పారాచూట్ ద్వారా సురక్షితంగా నేలపైకి దిగాడు. ఇది గమనించిన పాక్ సైనికులు అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి. రెండ్రోజులపాటు తమ వద్ద నిర్బంధించిన పాక్ శుక్రవారం విడిచిపెట్టాయి. భారత్ అన్ని విధాలుగా ఒత్తిడి పెంచడంతోపాటు, భేషరతుగా తమ పైలట్‌ను విడుదల చేయాల్సి తేల్చి చెప్పడంతో పాకిస్థాన్‌కు అభినందన్‌ను వదిలిపెట్టక తప్పలేదు.

శత్రువుల చెరలో ఉన్నప్పటికీ అభినందన్ ఏ మాత్రం భయపడలేదు, బెదరలేదు. పాక్ సైనికులు అడిగిన వ్యక్తిగత, దేశం గురించిన ప్రశ్నలకు ఆయన సున్నితంగా తాను చెప్పను అంటూ తిరస్కరించారు. ఆయన ధైర్యసాహసాలను దేశం యావత్తు అభినందిస్తోంది.

చదవండి: ‘పాక్ ఎఫ్-16ని కూల్చేశాం, మెరుపుదాడులతో జైషేకు భారీ నష్టం’: బుద్ధి చెబుతామన్న త్రివిధ దళాలు

- Advertisement -