అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
అమరావతిలో శుక్రవారం రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు సమీక్షించనున్నారు. మురళీమోహన్ కూడా హాజరు కానున్నారు. ఆ సందర్భంగా తన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మురళీమోహన్ కోడలు కూడా..
చారిటబుల్ ట్రస్టు కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నం కావడానికే పోటీ చేయట్లేదని మురళీమోహన్ స్పష్టం చేశారు. అంతేగాక, మురళీమోహన్‌కు ఆయన కోడలు రూప కూడా పోటీ చేయకూడదనే నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాగా, కాకినాడ ఎంపీ తోట నరసింహం తాను కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయబోనని ఇప్పటికే చెప్పేశారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే అమలాపురం ఎంపీ రవీంద్ర.. టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మురళీ మోహన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.








