28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ విశాఖ మోడీ పర్యటన: టీడీపీ, వామపక్షాల ఆందోళనలు, ‘నలుపు’తో నిరసనలు

విశాఖ మోడీ పర్యటన: టీడీపీ, వామపక్షాల ఆందోళనలు, ‘నలుపు’తో నిరసనలు

ap tdp nirasana
- Advertisement -


అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. విభజన హామీలు నెరవేర్చలేదని, ఆదాయంలేని విశాఖ రైల్వే జోన్ ప్రకటించారంటూ ధ్వజమెత్తారు. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు కూడా నల్లచొక్కా ధరించి నిరసన తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారంనాడు టీడీపీ, వామపక్ష శ్రేణులు ‘మోడీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా విశాఖ నగరంలో మోడీకి వ్యతిరేకంగా నల్లరంగులో హోర్డింగులు వెలిశాయి.

మరోవైపు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కిడారి శ్రవణ్‌, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మోడీ ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. అదే గాంధీ విగ్రహం వద్ద మూడ్రోజులుగా ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వ్యతిరేకంగా విజయవాడలో రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో నల్లచొక్కాలు, నల్లజెండాలతో నిరసన తెలిపారు. బెంజిసర్కిల్‌ వద్ద తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పాల్గొన్నారు. ప్రజలకు నమ్మక ద్రోహం చేసి విభజన గాయాలపై కారం చల్లేందుకే ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారని ఆయన విమర్శించారు.

ఇక గుంటూరులో తెలుగుదేశం శ్రేణులు నిరసన వ్యక్తంచేశాయి. మోదీకి వ్యతిరేకంగా నల్లబెలూన్లు ప్రదర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోనూ టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. వామపక్ష పార్టీల నేతలు కూడా విశాఖ, విజయవాడల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలుచోట్లు ఆందోళన చేస్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

చదవండి: మసిపూసి మారేడుకాయ: విశాఖ రైల్వే జోన్‌పై చంద్రబాబు, మోడీపైనా విమర్శలు…

- Advertisement -