న్యూఢిల్లీ: ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరిన ‘పెట్రో’ ఉత్పత్తుల ధరలు మళ్లీ క్రమంగా దిగిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత వరుసగా 16 రోజుల పాటు క్రూడాయిల్ ధర్ పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పడుతుండటంతో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా నెమ్మదిగా దిగొస్తున్నాయి.
వరుసగా ఐదో రోజైన ఆదివారం కూడా పెట్రోలు ధర తగ్గింది. పెట్రోలు ధరను 9 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. మరోవైపు డీజెల్ ధరను సవరించడం లేదని తెలిపింది.
తాజా ధరల వివరాలు పరిశీలిస్తే… ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 78.11, కోల్‌కతాలో రూ. 80.75, ముంబైలో రూ. 85.92, చెన్నైలో రూ. 81.09గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 82.74గా ఉంది. డీజిల్ ధర ఢిల్లీలో రూ. 69.11, కోల్ కతాలో రూ. 71.66, ముంబైలో రూ. 73.58, చెన్నైలో రూ. 72.97గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 75.12గా ఉంది.