ఇక చైనాకు వణుకే! మరోసారి అగ్ని-5 పరీక్ష, సగం ప్రపంచం భారత్ గుప్పిట్లో!!

- Advertisement -

న్యూఢిల్లీ: అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ అగ్ని-5ను భారత్ మరోసారి  విజయవంతంగా పరీక్షించింది. ఆదివారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్‌లో ఈ క్షిపణి పరీక్ష జరిగింది.  5 వేల కి.మీ. దూరంలోని లక్ష్యాలను సైతం అగ్ని-5 క్షిపణి అలవోకగా తాక గలదు.  ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ఇదో ఆరోసారి.

ఇప్పటి వరకు అగ్ని క్షిపణుల్లో అగ్ని-1 పరిధి 700 కి.మీ.లు, అగ్ని-2 పరిధి2000 కి.మీ.లు కాగా.. అగ్ని-3 పరిధి 2500 కి.మీ. అగ్ని-4 పరిధి 3500 కి.మీ. అగ్ని-5 క్షిపణిని తొలిసారిగా 2012, ఏప్రిల్ 19న ప్రయోగించారు.  చివరిసారిగా ఈ ఏడాది జనవరి 18న ఈ క్షిపణిని పరీక్షించారు.

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే వీలున్న అగ్ని-5 క్షిపణి చైనాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగలదు. 17 మీటర్ల ఎత్తు ఉండే ఈ క్షిపణి.. 1360 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనాల దగ్గర మాత్రమే ఇలాంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి.  అగ్ని సిరీస్‌లో ఇది అయిదో క్షిపణి కాగా.. దాదాపు సగం ప్రపంచం దీని గుప్పిట్లోకి వస్తుంది.

మరికొన్ని ప్రయోగాల తర్వాత అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని భారత సైన్యానికి అందజేస్తారు. అగ్ని-5లో రింగ్ లేజర్ గైరో బేస్డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ (ఆర్‌ఐఎన్ఎస్), మైక్రో నావిగేషన్ సిస్టమ్ (ఎంఐఎన్‌ఎస్)లను ఉపయోగించడం వల్ల నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు.  అంతేకాదు, అగ్ని-5 క్షిపణి దేశీయ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ ఆధారంగానూ పనిచేస్తుంది.

- Advertisement -