‘నా పేరు సూర్య’ మూవీ రివ్యూ

- Advertisement -

మరో స్టార్ రైటర్… డైరక్టర్ అయ్యారు. హ్యాపీసు.. అయితే అక్కడే ఓ చిక్కు ఉంది.  రైటర్.. దర్శకుడు అయ్యినప్పుడు ఆయనపై మరో బాధ్యత ఉంటుంది. అది… ఓ అద్బుతమైన కథతో మన ముందుకు వస్తారని జనం ఆశిస్తారు. తన దగ్గర ఉన్న కథల్లో బెస్ట్‌ని దాచుకుని.. సినిమా చేశాడని భావిస్తాం. మరి నిజంగా వక్కంతం వంశీ అలాంటి అద్బుతం జరిగే కథతో మన ముందుకు వచ్చారా?… కథల విషయంలో ఆచి తూచి అడుగులు వేసి హిట్స్ కొడుతున్న అల్లు అర్జున్ ఆ కథలో ఏ ఎలిమెంట్‌కు సినిమా చేయటానికి సై అన్నాడు?… అలాగే ఈ సినిమాలో రైటర్ కనపడ్డారా?.. డైరక్టర్ కనపడ్డారా?.. ఇలాంటి విషయాలు చూద్దాం…

స్టోరీ లైన్…

చిన్నప్పటి నుంచి సూర్య (బన్ని)కు ఏంగర్ మేనేజ్ మెంట్ తక్కువే. కోపం వస్తే ఎదుటివారు ఎవరున్నా తనకు అనవసరం అన్న రీతిలో బిహేవ్ చేస్తూ గొడవలు పడుతూంటాడు. ఆ గొడవలతోనే కుటుంబానికి దూరమైన అతను దేశభక్తిని నరనరానా నింపుకుని  సైన్యంలో చేరతాడు. అయితే అక్కడ కూడా తన కోపంతో పై అధికారులకు కోపం తెప్పిస్తాడు. చివరకు సూర్యని  కల్నల్‌(బొమన్‌ ఇరానీ)  ఆర్మి నుంచి  సస్పెండ్ చేస్తారు. తిరిగి ఆర్మీలోకి తీసుకోవాలంటే…  మానసికంగా ఫిట్‌గా ఉన్నట్లు వైజాగ్ లో ఉన్న  ప్రముఖ సైకాలజిస్ట్‌ రామకృష్ణం రాజు (అర్జున్‌) నుంచి సర్టిఫికేట్‌ తీసుకురావాలని కండిషన్‌ పెడతారు. ఆ పని మీద వైజాగ్‌ వచ్చిన సూర్యకు ఇక్కడ పని అనుకున్నంత ఈజీగా కాదు.    రామకృష్ణంరాజు 21రోజుల టైమ్  ఇచ్చి, కోపం తగ్గించుకుని కనపడమని సూర్యకు చెబుతాడు. అప్పుడు సూర్య ఏం చేసాడు.  విలన్ చల్లా(శరత్ కుమార్) ..సూర్య జీవితంలో ఎలా ప్రవేశిస్తాడు. ఇంతకీ రామకృష్ణరాజుకు సూర్యకు ఏమన్నా రిలేషన్ ఉందా.. సూర్య లో మార్పు వచ్చిందా, ఈ కథలో అను ఇమ్మాన్యుయేల్‌ పాత్ర ఏమిటి.. వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

దేశభక్తిని,హీరోయిజం ను కలుపుతూ,మధ్యమధ్యలో పాకిస్దాన్ ని తిడుతూ ఆ మధ్యకాలంలో తెగ సినిమాలు వచ్చేవి. అదేంటో ఈ మధ్యన మనదేశంలో సమస్యలు ఎక్కువ అయ్యి వాటిమీద కాన్సర్టేషన్ తగ్గిందో, లేక దర్శక,నిర్మాతల్లో దేశభక్తి లోపించిందో, లేక ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలు దేశభక్తిని కుప్పలు తెప్పలు కుమ్మరించటం వలనో కానీ దేశభక్తి సినిమాలు తగ్గిపోయాయి. ఆ విషయం గమనించినట్లున్నాడు రచయిత నుంచి దర్శకుడుగా మారిన వక్కంతం వంశీ. దేశభక్తికి, యాంగర్ మేనేజ్ మెంట్ అనే ఎలిమెంట్ ని కలిపి ‘నా పేరు కోపం నా కేరాఫ్    దేశభక్తి’అనే రీతీలో  రెండింటికి ముడి పెట్టి కథ రాసుకుని తెరకెక్కించారు.

ఈ రెండు మిక్సింగ్ లో వచ్చే అవుట్ పుట్ మరీ డ్రై గా ఉంటుందేమో అని డౌట్ వచ్చో ఏమో విలన్ అనే కమర్షియల్ ఎలిమెంట్ ని తీసుకొచ్చి కలిపాడు. అయితే ఎప్పుడైతే విలన్ ని తీసుకొచ్చారో అప్పుడు కథ రూపు రేఖలు మారిపోయి రొటీన్ తెలుగు సినిమాలా మారిపోతుందనే విషయం మర్పిపోయారు. విలన్ వచ్చిన దగ్గరనుంచి సినిమా చూస్తున్నవాళ్లకు..ఆ విలన్ ని ఎలా ఎదుర్కొంటాడు. అప్పుడు ఆ విలన్ ..ఎలా హీరోని దెబ్బ కొడతాడు. మళ్లీ ఎలా హీరో రివర్స్ అవుతాడు అనే ఆసక్తి పెరిగిపోయి…మిగతా ఎలిమెంట్స్ ఎన్ని చూపించినా ..కిక్ ఇవ్వదు. అదే ఈ సినిమాకు జరిగింది. విలన్ ని ప్రక్కన పెట్టేసి హీరో …తన కోపం తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు చేస్తూంటే..అతనిమీద కోపం వస్తుంది. ఎక్కడో క్లైమాక్స్ లో నాకు విలనే ముఖ్యం…కోపం తగ్గించుకోవటం కాదు అని రియలైజ్ అయ్యి విలన్ మీద యుద్దం ప్రకటించినా అప్పటికే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది.

ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సెకండాఫ్ లో ఓ టైమ్ లో పెద్ద ఫైట్ రావటం విలన్స్ చంపేయటంతో సినిమా అయ్యిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. అయితే వెంటనే ఓ సాంగ్ తో మళ్లీ కథ మొదలవ్వటంతో అక్కడ నుంచే సినిమా డ్రాప్ అవటం మొదలై,క్లైమాక్స్ లో వచ్చే సందేశంతో పూర్తిగా డల్ అయ్యిపోయింది.

పెద్ద ప్లస్ పాయింట్…

ఈ సినిమాలో పాకిస్దాన్ ని తిట్టడం వంటి అద్బుతమైన కార్యక్రమాలు లేకపోవటం దేశభక్తి సినిమాల వీరాభిమానులకు కాస్తంత నిరాశపరచవచ్చేమో కానీ…చాలా మందికి ఆ విషయంలో దర్శకుడు చాలాతెలివైన నిర్ణయం తీసుకుని ఊరట కలిపించాడు అనిపించాడనిపిస్తుంది.

ఇక ఈ కోపం, దేశభక్తి, విలన్ అనే గొడవలో పడి…హీరోయిన్ విషయం మర్పిపోయారు. ఆమె ఎప్పుడు వస్తుందో..ఎందుకు వస్తుందో..మళ్లీ ఎందుకు వెళ్లిపోతుందో దర్శకుడుకే తెలియాలి అన్నట్లుగా కథ,కథనం సెట్ అయ్యాయి.

ఆయనే మైనస్…

దీనికి తోడు ఈ సినిమాకు అర్జున్ ఒకరు మైనస్ అనిపిస్తారు. అదేంటో తెలుగులో అర్జున్ హీరోతో పాటు ప్రధాన పాత్రలో చేసిన శ్రీ ఆంజనేయం,  రామ రామ కృష్ణ కృష్ణ, లై సినిమాలు తేడా కొట్టాయి. ఇప్పుడీ సినిమాలో కూడా అర్జున్ లేకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

కొత్త కుర్రాడు బాగా చేశాడు…

ఇక ఈ సినిమాలో ముస్లిం కుర్రాడుగా చేసిన నిర్మాత కుమారుడు అనుకుంటాను.. చాలా బాగా చేశాడు. అంత సీనియర్స్ పక్కన కనిపించినా ఎక్కడా తడబాటు అనేది లేదు. మంచి కథతో లాంచ్ అయితే మంచి భవిష్యత్ ఉండేలా ఉన్నాడు.

స్పెషల్లీ మెన్షన్…

సినిమాలో చేసింది కొద్దిసేపే అయినా శశి పోలీస్‌గా చాలా బాగా చేశారు.

ఫైట్స్, పాటలు…

అల్లు అర్జున్ వంటి మాస్ హీరో నుంచి ఆశించే ఫైట్స్  దొరుకుతాయి కానీ వాటికి లీడ్ చేసే రీజన్స్ పర్శనల్ గా ఉండటంతో ….ఎమోషన్ కనెక్ట్ కాదు. పాటల్లో తెలుగు ప్లేవర్ అసలు లేదు. క్లైమాక్స్ ముందు వచ్చే సాంగ్ మాత్రం బన్ని ముద్ర కనిపిస్తుంది.

వక్కంతం వంశీ డైరక్షన్ ఎలా ఉందంటే…

గతంలో యండమూరి వీరేంధ్రనాధ్ వంటి స్టార్ రైటర్ .. డైరక్టర్ గా మారి చిరంజీవి వంటి మెగాస్టార్ తో … స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమా చేశారు. అయితే రకరకరాల కారణాలు వల్ల అది వర్కవుట్ కాలేదు. మళ్లీ చాలా కాలం తర్వాత దాదాపు ఆ స్టాయి స్టార్ మెగా హీరో ఓ రైటర్ కు అవకాశం ఇచ్చారు. (అఫ్‌కోర్స్  త్రివిక్రమ్‌తో పవన్ సినిమాలు చేసినా మహేష్ తో అతడు వచ్చాకే అది జరిగింది). దాంతో ఈ సినిమాపై అందరి దృష్టీ ఉంది. అయితే దర్సకుడుగా వక్కంతం వంశీ కొన్ని సీన్స్ బాగా తీసారు, రైటర్ గా కొన్ని డైలాగులు సైతం అద్బుతంగా పండించారు. కానీ  స్క్రిప్టు దగ్గరే ఆయన ఎంపిక సరిగ్గా చేసుకోలేదు. సెకండాఫ్ అంతలా డ్రాప్ అవుతున్న విషయాన్ని ఆయన గమనించలేకపోయారు.అక్కడ కొద్ది జాగ్రత్తలు తీసుకుని మరో కొరటాలశివ తెలుగుకు దొరినట్లు అయ్యేది.

కామెడీ కావాలి భయ్యా…

ఈ  సినిమాలో వెన్నెల కిషోర్ ని పెట్టుకున్నారు కానీ ..సినిమాకు ఆయన కామెడీ సరిపోలేదనిపించింది.

హైలెట్  డైలాగులు…

ఇదేమైనా డైటింగా? ఫైటింగ్‌… కొలత వేసుకుని కొట్టడం నాకు తెలియదు… 

ప్రవర్తన మార్చుకోమని పాకిస్థానీలకే అవకాశం ఇస్తున్నాం.. మనోడు సార్‌ లాస్ట్‌ ఛాన్స్‌…

యుద్ధం చేయాలి.. వాడి బాబుతోనో, నా బాబుతోనో కాదు.. నాతో నేనే యుద్ధం చేయాలి. ఎందుకంటే నాకు నేనే శ్రతువు… 

దేశానికి కష్టం వస్తే ఒంటి కాలిపై నిలబడ్డాను. నాకు ఏదైనా కష్టం వస్తే దేశం నిలబడదా!..

టెక్నికల్ గా…

ఈ సినిమాకు ముందే చెప్పుకున్నట్లు పాటలు మైనస్.   . ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, కెచ్చ, పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ స్టంట్స్ ఫ్యాన్స్ కు పండగే. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ హై స్టాండర్డ్స్ లో ఉంది.   కోటగిరి వెంకటేశ్వరావు  ఎడిటింగ్  సెకండాఫ్ లో ఓ అరగంట లేపేయకుండా ఎందుకు క్షమించారా అనిపించింది.  శిరీష శ్రీధర్ లగడపాటి, బన్నీ వాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

అల్లు అర్జున్ ఎలా ఉన్నాడు…

ఈ సినిమాలో అల్లు అర్జున్ ని చూస్తే …ఓ సినిమాలో పాత్ర కోసం తనను తాను మార్చుకోవటానికి పడిన కష్టం కళ్ల ముందు కనపడుతుంది. యాక్షన్ సీన్స్ లో ఆయన విశ్వరూపం కనపడుతుంది.

కొన్ని డౌట్స్…

పోసాని పాత్ర ఎడిటింగ్ లో ఏమన్నా కట్ అయ్యిందో ఏమో కానీ …అసలు అతనికి, హీరోకు మధ్య ఏం జరిగిందో రిజిస్టర్ చేయలేదు.. చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంది.  కొద్ది గ్యాప్ తర్వాత వచ్చిన కొడుకు (అల్లు అర్జున్)ని  తల్లి (నదియా…)  గుర్తుపట్టకపోవటమేంటి.. మరీ పసిబిడ్డగా ఉన్నప్పుడు విడిపోలేదు కదా..?

ఫైనల్ థాట్…

రైటర్స్ డైరక్టర్స్ అయ్యినప్పుడు వేరే రైటర్స్ చేత కథలు రాయించుకోవటం బెస్టేమో..

– సూర్య ప్రకాష్ జోశ్యుల

- Advertisement -