మీ ‘లోపలి మనిషి’ని మీరు చూడాలంటే.. ఈ సినిమా తప్పక చూడాలి.
అవును, ప్రతి మనిషికి ’లోపల మనిషి‘ ఒకడుంటాడు. వాడెప్పుడూ బయటకు రాడు. అలాగే బయటకు కనిపించే మనిషి మాత్రం..ఒక షో చేస్తుంటాడు. అదే అందరికీ కనిపిస్తుంది. కానీ లోపల ఉన్నవాడు రాక్షసుడా, మంచివాడా, ప్రేమించేవాడా? ప్రేమను ద్వేషించేవాడా? అనేది ఎవరికి తెలీదు.
కానీ బయటేమైనా వాడికి నచ్చింది జరిగితే.. లోపల ఉన్నవాడు కంగారుపడిపోయి.. ఆతృత పడిపోతుంటాడు. అందుకే రోడ్డుపై ప్రమాదాలు జరిగినప్పుడు.. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవాళ్లను చూడండి.. కిటికీల్లోంచి తలలు బయటపెట్టి చూస్తుంటారు. వీధిలో గొడవ జరిగితే అందరూ వచ్చి గుమిగూడిపోతుంటారు..
అలాగే ఇంటిపక్కన మొగుడూ పెళ్లాల తగువులను చెవులు రిక్కించి ఆసక్తిగా వింటుంటారు.. ఇదంతా లోపలి మనిషి ఆసక్తి.. వాడు బయటికి రాలేడు.. కానీ ఇలాంటి చర్యల ద్వారా బయటపడతాడు… ఆ ఇన్సిడెంట్ కాగానే.. వాడి ఆసక్తి తీరిపోగానే.. వెళ్లిపోతాడు. బయటి మనిషి తన మానాన తాను బైక్‌పై అలా వెళ్లిపోతాడు.
ఇదంతా ఎందుకంటే..
ఇప్పుడు చెప్పినదానికి..ఈ సంఘటనలకి దగ్గరగా పూరీ జగన్నాథ్ లేటెస్ట్ గా తీసిన ఇస్మార్ట్ శంకర్ రిలీజై..మాస్ ని ఊపేస్తోంది. కరెక్ట్ గా పైన ఏం చెప్పుకున్నామో.. పూరీ జగన్నాథ్ కూడా మనిషిలో దాగి ఉన్న లోపలి మనిషిని తట్టి లేపి బయటకు తీసుకువచ్చి.. వాడెలా ఉంటాడో చూపించాడు. అదే ‘ఇస్మార్ట్ శంకర్’..
ఇప్పుడీ లోపలి మనిషి ప్రవర్తించే చిప్ ఎక్కడుంటుందంటే.. బ్రెయిన్‌లో ఉంటుంది. అక్కడ నుంచే అంతా స్టార్ట్ అవుతుంది. ఆ బ్రెయిన్ డబల్ రోల్…అవసరమైతే అపరిచితుడిలా త్రిబుల్ రోల్ కూడా ప్లే చేస్తుంది. ఇప్పుడా చిప్ ని మార్చేశాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్..
అదెలాగంటే..
ఒక సీబీఐ ఆఫీసర్ అరుణ్(సత్యదేవ్).. ఒక కీలకమైన కేసు ఇన్విస్టిగేషన్ చేస్తూ మరణిస్తాడు. కానీ ఆ వివరాలన్నీ అతనికే తెలుసు.. అప్పటికే..ఒక మర్డర్ కేసులో జెయిల్ లో ఉన్న హీరో ఇస్మార్ట్ శంకర్ బ్రెయిన్ మార్పిడి చేస్తారు. అదే ధిమాక్ ఛేంజ్ చేస్తారు. అప్పటివరకు ఉన్న క్రిమినల్ ఆలోచనలతో ఉన్న బ్రెయిన్..పోలీస్ ఆఫీసర్ లా పనిచేస్తుంది.
ఇదే సినిమాంతటికీ మూల కథ.. దీనిచుట్టూనే కథంతా రయ్..రయ్ మని తిరిగిపోతుంటుంది. అంత స్పీడుగా తీసుకువెళతాడు. పూరీ మార్క్ మాస్..కి మరింత మసాలా జోడించి.. దానికి తెలంగాణ భాషని జోడించి.. పరుగులు తీయించాడు. దీనిని ప్రేక్షకులకు కన్విన్స్ చేయడానికి.. భారీ చిత్రాల తమిళ డైరెక్టర్ శంకర్ తరహాలో చెప్పించడానికి చూశాడు..
కానీ చిన్న లింక్ కుదరలేదనే చెప్పాలి. అయితే దానినెవరూ పెద్ద సీరియస్ గా.. ఈ సినిమాలో చూసే స్థితిలో ప్రేక్షకుడు ఉండడు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకుడికి లాజిక్ అక్కర్లేదు. అతనికి సినిమా నచ్చాలి అంతే.. పూరీ మార్క్ డైలాగ్ తరహాలో చెప్పాలంటే
’ఎలా తీశామన్నది కాదన్నయ్యా..ఎలా ఉందన్నది ముఖ్యం..‘
తెలంగాణ భాష విషయంలో ప్రతికూల వాతావరణం అప్పుడే మొదలైంది.కానీ సినిమా పరంగా చూస్తే మాత్రం దుమ్ము రేపుతోంది. మొదటి రోజే రికార్డ్ కలెక్షన్స్ వసూలవు తున్నాయి. రూ.18 కోట్లకి సినిమా అమ్మితే..ఓవర్సీస్ తో సహా అన్నీ కలుపుకొని మొదటిరోజే షేర్ 9 కోట్లు పైనే ఉండటం విశేషం.
నాలుగురోజుల్లో మొత్తం పెట్టుబడి లాభాలతో సహా వచ్చేసేలా ఉందని సినీ ఇండస్ట్రీ టాక్..అలాగే రామ్ సినిమాకి ఇంత భారీ ఓపినింగ్స్ రావడం చూసి..సినీ విశ్లేషకులు నోరెళ్లబెడుతున్నారు. కరెక్ట్ డైరెక్టర్ దొరికే, పవర్ ఫుల్ డైలాగ్ పడితే..రామ్ ఆ పాత్రను ఒక ఆటాడుకుంటాడనడానికి ‘ఇస్మార్ట్ శంకర్’ ఒక ఉదాహరణ..
క్యారెక్టర్ ని ఒక ఊపు ఊపేసి వదిలేశాడు. అంత గొప్పగా చేశాడు. తెలంగాణ భాషలో డైలాగుల్ని డైనమెట్లులా పేల్చి వదిలేశాడు. మొత్తానికి పూరీ జగన్నాథ్ చాలాకాలం తర్వాత మళ్లీ చక్కటి సినిమా చేసినందుకు ఇండస్ట్రీ అంతా హ్యాపీగా ఉంది.
ఇక మణిశర్మ సంగీతం సినిమాకి హైలైట్ అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఇరగదీసి వదిలేశాడనే అనాలి. చాలాకాలం తర్వాత క్యాచీ ట్యూన్స్ తో ఆకట్టుకునే పాటలు చేశాడు.
చెప్పుకోవడానికి కథేమి ఉండదు…
ఇదండీ ఇస్మార్ట్ శంకర్ సంగతులు.. చెప్పుకోవడానికి కథేమి ఉండదు… ఫస్ట్ ఆఫ్ అంతా అలా అలా సాగిపోతుంటుంది. హీరోయిన్లు . నభా నటేష్, నిధి అగర్వాల్ తమ శక్తి వంచన లేకుండా అందాలను ఆరబోసేశారు. గ్లామర్ తో తెరను పండించారు.
మొత్తానికి మీ లోపలి మనిషిని ప్రత్యక్షంగా చూడాలంటే ఈ సినిమా చూస్తూ.. అప్పడప్పుడు మీలో మిమ్మల్ని చూసుకోండి. వాడు ఇట్టే దొరికిపోతాడు. ఎందుకంటే వాడికి పండగ..ఈ సినిమా.
ఒక సాధారణ మనిషి చేయలేనివి ఇవన్నీ.. మరొకరు చేస్తుంటే చూసి ఆనందిస్తుంటాడు. అందుకే చూడండి.. ఒకసారి మీలో మనిషికి హాయ్ చెప్పండి. వాడు పొందే ఆనందం మీది కాదు…వాడిది. సినిమా చూస్తూ సీట్లోంచి ఎగిరి గంతేస్తే.. అది కూడా మీ సంతోషం కాదు.. వాడిది.. అదే ‘ఇస్మార్ట్ శంకర్’ మ్యాజిక్.