మనసుల్ని కదిలించిన మహానాయకుడి పాత్ర: ‘యాత్ర‌’ మూవీ రివ్యూ…

yatra director responce on reviews
- Advertisement -

ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చేసిన పాద‌యాత్ర ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఓ కీల‌కఘ‌ట్టం. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావ‌డానికి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి వైఎస్సార్‌ చేసిన పాద‌యాత్ర ప్ర‌ధాన కారణం అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతుంటారు.

ఆ ఘ‌ట్టం ఆధారంగానే ‘యాత్ర‌’ తెర‌కెక్కింది. మ‌రి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం…

ఇదీ కథ…

ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి(మమ్ముట్టి) చేసిన పాద‌యాత్ర, అందులోని భావోద్వేగాలతో ప్ర‌ధానంగా సాగే చిత్ర‌మిది. పాద‌యాత్ర ఎలా మొద‌లుపెట్టారు? ఆ ప్ర‌యాణంలో ప్ర‌జ‌ల క‌ష్టాల్ని ఎలా విన్నారు? వాళ్ల‌కి తానున్నాన‌నే భ‌రోసా ఎలా ఇచ్చారు? వైఎస్సార్‌ ప్ర‌వేశపెట్టిన ఉచిత ‌విద్యుత్తు, ఆరోగ్య‌శ్రీ, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ త‌దిత‌ర పథకాలకి పాద‌యాత్ర ఎలా కార‌ణ‌మైంది? అనే విష‌యాల్ని ఈ సినిమాలో చూడొచ్చు.

జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ, హై క‌మాండ్‌ని కాద‌ని ఆయ‌న ఎలా నిర్ణ‌యాలు తీసుకునేవారు? వ‌్య‌క్తిగ‌తంగా ఆయ‌న పార్టీపైన ఎలాంటి ముద్ర వేశారు? ప‌్ర‌జ‌ల్లో ఎలా ఇమేజ్ తెచ్చుకున్నార‌నే విష‌యాల్ని ఇందులో చూపించారు. హైక‌మాండ్‌తో రాజ‌కీయాలు, పాద‌యాత్ర మొద‌లుకొని… ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం స్వీకారం చేయ‌డంతో ఈ క‌థ ముగుస్తుంది.

విశ్లేషణ…

ఇది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కథ కాదు.. ఆయన వ్యక్తిత్వం. వైఎస్‌ఆర్‌ రాజకీయం ఎలా ఉంటుంది? మాటకు, నమ్మకానికి ఆయన ఇచ్చే విలువ ఏంటి? ఆయనను నమ్ముకున్న వ్యక్తులకు ఆయనకు ఎలాంటి భరోసా ఇస్తారు? పాదయాత్రకు ముందు పాదయాత్ర తరువాత వైఎస్‌ఆర్‌లో వచ్చిన మార్పు ఏంటి? ఇలా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వాలను వెండితెర మీద ఆవిష్కరించారు.

తొలి సన్నివేశం నుంచే వైఎస్‌ఆర్‌ రాజకీయం ఎలా ఉంటుందో ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చూపించారు. పాదయాత్రలో ఆయన ప్రజలతో వైఎస్‌ఆర్‌ మమేకమైన తీరు, వారి కష్టాలను అవలోకనం చేసుకోవడం లాంటి అంశాలు బాగా ఆకట్టుకుంటాయి.

‘మ‌న గ‌డ‌ప తొక్కి సాయం అడిగిన ఆడ‌బిడ్డ‌తో ఏందిరా రాజ‌కీయం’ అనే సంభాష‌ణ‌తో వైఎస్సార్‌ వ్య‌క్తిత్వాన్ని ఆవిష్క‌రించి… త‌నవాళ్లు అనుకున్నాక ఆయ‌న వాళ్ల కోసం ఎంతదూర‌మైనా వెళ‌తారనే విష‌యాన్ని ఆత్మీయుడైన కేవీపీ పాత్ర‌తో చూపించారు. చేవెళ్ల నుంచి పాద‌యాత్ర మొద‌లుపెట్టే స‌న్నివేశాలతో భావోద్వేగాలు పండ‌టం మొద‌ల‌వుతుంది.

తన ప్రత్యర్థి కూతురు ఇంటికి వచ్చి సాయం అడిగితే.. సాయం చేయద్దన్న వారితో ‘మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా’ అనే రాజన్న మాటలకు ఎవరికైనా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. హైకమాండ్ పెద్దలు వచ్చి మీ ఒక్కరితోనే మాట్లాడలన్నప్పుడు పక్కన కేవీపీ ఉన్నా.. ‘మీరు ఇప్పుడు ఒక్కరితోనే మాట్లాడుతున్నారు’ అనటం ఆయన స్నేహానికి ఎంత విలువ ఇచ్చేవారో గుర్తు చేస్తుంది.

మాట ఇచ్చేముందు ఆలోచించాలి.. ఇచ్చాక చేసేదేముంది ముందుకెళ్లాల్సిందే’ అన్న మాటల్లో ఆయన విశ్వసనీయత ఎంతటిదో అర్ధమవుతుంది. ‘నేను పార్టీకి విధేయుణ్ని మాత్రమే బానిసను కాదు’ అంటూ హైకమాండ్‌ పెద్దలను ఎదిరించినప్పుడు ఆయన ధైర్యం ఎలాంటిదో అర్ధమవుతుంది.

కె అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకుడికి మరింత దగ్గర చేశాయి. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌, సత్యన్‌ సూరన్ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటాయి. సినిమాకు మరో ప్రధాన బలం సిరివెన్నెల సీతారామశాస్త్రీ అందించిన సాహిత్యం. ఆయన అందించిన పాటలు వైఎస్‌ వ్యక్తిత్వానికి అక్షరాల్లో ఆవిష్కరించాయి. చివర్లో వచ్చే పెంచల్‌దాస్‌ పాట ప్రతీ ప్రేక్షకుడిని కంటతడిపెట్టిస్తుంది.

బయోపిక్‌ కావటంతో సినిమా అంతా ఒక్క రాజశేఖర్‌రెడ్డి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రలో మమ్ముట్టి జీవించాడనే చెప్పాలి .అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతిఒక్కరూ కూడా తమ తమ పాత్రలలో లీనమైపోయారు.

ఇవీ ప్లస్‌లు…

మ‌మ్ముట్టి న‌ట‌న, భావోద్వేగాలు, చివరి స‌న్నివేశాలు, సంగీతం.

మైనస్‌లూ ఉన్నాయి…

డాక్యుమెంట‌రీలా కొన్ని స‌న్నివేశాలు, ద్వితీయార్థం.

రేటింగ్ : 3.5

ఫైనల్ థాట్ : మనుసుని కదిలించే మహా ‘యాత్ర‌’

సినిమా పేరు : యాత్ర
జానర్ : బయోగ్రాఫికల్‌ మూవీ
తారాగణం : మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని, రావూ రమేష్‌, అనసూయ, పోసాని కృష్ణమురళి
సంగీతం : కె
దర్శకత్వం : మహి వీ రాఘవ
నిర్మాత : విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి
విడుద‌ల‌: 8 ఫిబ్ర‌వ‌రి 2019
సంస్థ‌: 70 ఎమ్‌.ఎమ్‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

- Advertisement -