29.2 C
Hyderabad
Saturday, August 29, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం నితిన్ గడ్కరీపై సోనియా గాంధీ ప్రశంస, విపక్షాలు కూడా…

నితిన్ గడ్కరీపై సోనియా గాంధీ ప్రశంస, విపక్షాలు కూడా…

sonia-nitin
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీపై రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంశించగా.. తాజాగా యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా అదేబాటలో నడిచారు. గురువారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో అధికార బీజేపీకి చెందిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని సోనియాగాంధీ ప్రశంసించారు.

ఒకదశలో సోనియాతో పాటు కాంగ్రెస్‌ సభ్యులంతా ఆయనకు అభినందనపూర్వకంగా బల్లలపై చేతులతో చరిచారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి మంత్రి గడ్కరీ చేస్తున్న కృషి అద్భుతమంటూ సోనియాగాంధీ కితాబునిచ్చారు. జీరో అవర్ సందర్భంగా గడ్కరీ తన మంత్రిత్వశాఖకు సంబంధించిన రెండు ప్రశ్నలకు సమాధానమిస్తూ దేశంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.

తన శాఖ పనితీరుకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంపీలంతా తనను అభినందిస్తున్నారని అన్నారు. సభ్యులందరి నియోజకవర్గాల్లో అనేక పనులు చేపట్టినట్లు వివరించారు. కాగా, గడ్కరీ సమాధానాలివ్వడం పూర్తిచేసిన వెంటనే అధికార బీజేపీ సభ్యులంతా బల్లలు చరిచారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ పార్టీ ఎంపీ గణేశ్‌సింగ్‌ నిల్చొని గడ్కరీ కృషికిగాను సభ ఆయనను అభినందించాలని స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ను కోరారు. గడ్కరీ చెప్పిందంతా శ్రద్ధగా విన్న సోనియాగాంధీ అప్పుడప్పుడూ ఆయన చెప్పిన అంశాలకు సమాధానంగా తల ఊపుతూ కనిపించారు.

గణేశ్‌సింగ్‌ ప్రతిపాదన నేపథ్యంలో ఆమె చిరునవ్వుతో నితిన్ గడ్కరీని అభినందిస్తూ బల్లపై కొట్టడం ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే సహా ఆ పార్టీ ఎంపీలు, ఇతర సభ్యులు కూడా బల్లలు చరిచి మద్దతు తెలపడం గమనార్హం.

కాగా, గత ఆగస్టులో తన నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన పనులకు సానుకూలంగా స్పందించడంతో నితిన్‌ గడ్కరీకి కృతజ్ఞతలు తెలుపుతూ సోనియా లేఖ రాసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే బీజేపీలో దమ్మున్న నేత నితిన్‌ గడ్కరీ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

- Advertisement -