‘‘ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక దేశానికి ప్రధానమంత్రి కావాలి.. మీరు ప్రధాని అయితే మేమంతా సంతోషిస్తాం..’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాటలివి. విజయవాడలో జరుగుతోన్న ‘మహానాడు’లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదంటూ కితాబునిచ్చారు. “చంద్రబాబు మాట్లాడితే నేనిక్కడే ఉంటానని అంటారు.. ఏంది సర్ నాకు అర్థం కాదు. ఇక సీఎం పదవిపై మీకు ఆశ చావలేదా? వద్దు సార్.. మీరు ఇంకా పైపైకి వెళ్లాలి..’’ అంటూ జేసీ తన మనసులోని ఆకాంక్షను వ్యక్తం చేశారు.
అంతేకాదు, ‘‘నేను మరో విషయం చెబుతా.. ప్రతి వాడు కుటుంబ పాలన అంటూ మాట్లాడుతున్నారు. టీడీపీని చంద్రబాబే ఈ స్థాయికి తీసుకొచ్చారు. రేపు నారా లోకేశ్ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? ఆయన సమర్థుడే కదా.. నేను సంపాదించిన ఆస్తి నా కొడుకుకి ఇవ్వనా?.. ఇక్కడ ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నాడు. ఆయన సంపాదించిన ఆస్తి తన కొడుకుకి ఇవ్వడా?.. టీడీపీ అనేది చంద్రబాబు సొంతం. ఆయన కొడుకుకి ఎందుకు ఇవ్వకూడదు? చంద్రబాబు ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు?..” అంటూ దివాకర్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం అయిందని, ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నంత వరకు ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే వైసీపీ అధినేత జగన్‌కు అన్నీ వాళ్ల తాత బుద్ధులే వచ్చాయని జేసీ వ్యాఖ్యానించారు. జగన్ ఎప్పుడూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటారని, అది వాళ్ల తాత బుద్ధి అని, అందుకే ఇప్పుడు చంద్రబాబును విమర్శించడమే పనిగా జగన్ పెట్టుకున్నారని ఎంపీ దివాకర్ రెడ్డి అన్నారు.