28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం సెల్యూట్: అభినందన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోడీ, ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు

సెల్యూట్: అభినందన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోడీ, ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు

- Advertisement -

narendra modi 2
కన్యాకుమారి: పాకిస్థాన్ నిర్బంధం నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌‌పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. అభినందన్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తులు కావడం దేశానికే గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు.

శుక్రవారం కన్యాకుమారిలో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. ‘ధైర్యశాలి అభినందన్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం ప్రతి ఒక్కరికీ గర్వించదగిన విషయం. దేశం కోసం ఆయన చూపిన ధైర్యసాహసాలు ఆదర్శనీయం. దేశానికి తొలి రక్షణమంత్రిగా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్‌ కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తి’ అని వ్యాఖ్యానించారు.

అంతేగాక, ‘మధురై-చెన్నై మధ్య నడిచే వేగవంతమైన రైలు తేజస్‌ చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారైంది. మేకిన్‌ ఇండియాకు ఇదొక గొప్ప ఉదాహరణ. అత్యాధునిక రైళ్లను మన దేశంలోనే తయారు చేయడం దేశానికే గర్వకారణం’ అని మోడీ పేర్కొన్నారు. పుల్వామా ఘటనలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని.. దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవ చేస్తున్న సైనికులకు మోడీ సెల్యూట్‌ చేశారు.

గతం వేరు.. ఇది సరికొత్త ఇండియా: మోడీ హెచ్చరిక

గత కొన్నేళ్లుగా భారత్‌ ఉగ్ర సమస్యను ఎదుర్కొంటోందని, ఇక మీదట అలా జరగబోదని మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ముంబై ఉగ్రదాడి జరిగిన తర్వాత వాళ్లకు వ్యతిరేకంగా ఏమీ జరగలేదని.. కానీ, యురీ దాడి జరిగిన తర్వాత ముష్కరులపై భారత సైన్యం ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందో అందరూ చూశారని ప్రధాని గుర్తు చేశారు.

తాజాగా పుల్వామా దాడికి ప్రతీకారంగా వైమానిక దళాలు గట్టి బదులిచ్చాయన్నారు. గతంలో ఉగ్రదాడులు జరిగిన సమయంలో చర్యలు తీసుకునేందుకు యూపీఏ ప్రభుత్వం వారికి అధికారం ఇవ్వలేదని, కానీ ఇప్పుడు సైన్యానికి అన్ని అధికారాలు ఇచ్చామన్నారు. ఇదే సరికొత్త ఇండియా అని మోదీ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌కు అండగా నిలుస్తూ భారతదేశానికి హాని తలబెడుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రజలు నిజాయతీ గల నేతలను కోరుకుంటున్నారని.. వారసత్వ రాజకీయాలను కాదని మోడీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు బీభత్సం సృష్టిస్తుంటే భారత్‌ ఇక నిస్సహాయంగా చూస్తూ ఉండబోదని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు.

చదవండి: స్వదేశానికి చేరుకున్న అభినందన్: వీరుడికి ఘనస్వాగతం, గర్వపడే క్షణమన్న మోడీ

- Advertisement -