
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజూ పాజిటివ్ కేసులు సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా బుధవారం(ఏప్రిల్ 15) వరకు 11,439 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కాటుకు ఇప్పటి వరకు మొత్తం 377 మంది బలయ్యారు.
చదవండి: షాకింగ్: ఉస్మానియాలో పీజీ వైద్యులపై.. రోగుల దాడి! అసలేం జరిగిందంటే…
గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,076 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 38 మంది మరణించారు. దేశంలోకెల్లా అత్యధికంగా మహారాష్ట్రలో 2,337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత 1,510 కేసులతో దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా, తమిళనాడు 1,173 పాజిటివ్ కేసులతో మూడో స్థానంలో నిలిచింది.
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర అవుతుండడంతో లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈనెల 20 వ తేదీ వరకు నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయని, ఆ తరువాత కొన్ని సడలింపులు ఇస్తారని మంగళవారం ప్రధాని మోడీ కూడా తన ప్రసంగంలో తెలిపారు.
కేంద్రం విధించిన లాక్‌డౌన్ నిబంధనలు ఇవే…
హాట్‌స్పాట్‌లను ప్రకటించే అధికారం రాష్ట్రాలదే. ఈ హాట్‌స్పాట్‌లలో జన సంచారం ఉండరాదు. ఇల్లు వదిలి పబ్లిక్ ప్రదేశాలలోకి వచ్చే వారు తప్పనిసరిగా ఫేస్ మాస్కు ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే జరిమానా విధిస్తారు. అంత్యక్రియల సమయంలోనూ 20 మందిని మాత్రమే అనుమతిస్తారు.
మే 3 వరకు రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణా బంద్. పబ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, షాపింగ్ మాల్స్‌పై ఆంక్షలు కొనసాగుతాయి. మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం. విద్యా సంస్థల కార్యక్రమాలన్నీ రద్దు. సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతి ఉండదు.
అన్ని రకాల ఈ-కామర్స్ కార్యక్రమాలకు అనుమతి ఉంటుంది. అలాగే వ్యవసాయ, అనుబంధ రంగాలకు అనుమతి ఇస్తారు. కాఫీ, తేయాకు తోటల్లో 50 శాతం పని వారిని మాత్రమే అనుమతిస్తారు.
నిర్మాణ రంగానికి పరిమిత అనుమతి. నిర్మాణ రంగంలో పనులకు స్థానిక కార్మికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలకు అనుమతి, పట్టణ పరిధిలోలేని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విధులకు హాజరయ్యే వారికి ప్రత్యేక వాహనాలు సమకూర్చాలి. వాహనాల్లో 30-40 మంది మాత్రమే ప్రయాణించాలి. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో చేతుల శానిటైజేషన్ తప్పనిసరి. విధి నిర్వహణలో ఉండే వాహనాలూ శానిటైజ్ చేయాలి.
కార్యాలయాల్లోనూ ఉద్యోగుల మధ్య దూరం ఆరు అడుగులు ఉండాలి. విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరికీ మెడికల్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. షిప్ట్ మారే సమయంలోనూ సోషల్ డిస్టెన్స్ పాటించేలా గంట వ్యవధి ఇవ్వాలి.








