జమ్మూ కశ్మీర్: పాకిస్తాన్ బలగాలు మరో దుశ్యర్యకు పాల్పడ్డాయి. భారత్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాను నరేంద్ర కుమార్ గొంతు కోసి, అతడి కనుగుడ్లు పీకేసి.. ఆ మృతదేహాన్ని జమ్మూలోని రామ్‌గర్ సెక్టార్‌లో..అంతర్జాతీయ సరిహద్దు వద్ద పడేసింది. ఈ ఘటనతో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
భారత బలగాలు అంతర్జాతీయ సరిహద్దు వద్ద హై అలర్ట్ ప్రకటించాయి. అంతేకాదు, ఈ దుశ్చర్యకు పాల్పడిన పాకిస్తాన్ జవాన్లపై ఆ దేశ ప్రభుత్వానికి కూడా భారత్ ఫిర్యాదు చేసింది. పాకిస్తాన్ జవాన్లు నరేంద్ర కుమార్ గొంతు కోయడమే కాదు.. అతడిపై కాల్పులు కూడా జరిపినట్లు అతడి మృతదేహంపై ఏర్పడిన బుల్లెట్ గాయాలు చెబుతున్నాయి. అయితే భారత జవాను నరేంద్ర కుమార్‌పై పాకిస్తాన్ బలగాల దుశ్చర్యపై ఆ దేశ అధికారులు స్పందించలేదు.
ఆరుగంటల పాటు సెర్చ్ ఆపరేషన్…
అంతకుముందు.. భారత జవాను నరేంద్ర కుమార్ కనిపించక పోవడంతో.. అతడి ఆచూకీ కనుగొనేందుకు తమతో కలిసి గాలింపు చర్యలు చేపట్టాలని పాక్ ఆర్మీని భారత ఆర్మీ కోరింది. అయితే పాక్ ఆర్మీ అధికారులు ఏవో సాకులు చూపి ఇందుకు నిరాకరించడంతో భారత ఆర్మీ అధికారులే అతి కష్టం మీద రిస్క్ ఆపరేషన్ నిర్వహించి చివరికి మంగళవారం జమ్మూలోని రామ్‌గర్ సెక్టార్‌లో.. అంతర్జాతీయ సరిహద్దు వద్ద నరేంద్ర కుమార్ మృతదేహాన్ని కనుగొన్నారు.
అంతర్జాతీయ సరిహద్దు వద్ద జరిగిన ఈ తొలి ఘటనను భారత విదేశాంగ శాఖ, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనపై పాకిస్తాన్ ఆర్మీ వివరణ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద గడ్డి ఎక్కువగా పెరగడంతో దాన్ని తొలగించేందుకు పెట్రోల్ పార్టీ వెళ్లిందని, ఆ సమయంలోనే జవాను నరేంద్ర కుమార్ అదృశ్యమయ్యాడని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.