విజయ్ మాల్యాకు షాక్! భారత్‌కు అప్పగించాలంటూ లండన్ కోర్టు ఆదేశం!!

shock-to-vijay-mallya
- Advertisement -

లండన్: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన్ని భారత దేశానికి అప్పగించాలంటూ సోమవారం వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయ్ మాల్యా రూ.9 వేల కోట్ల మేర భారతీయ బ్యాంకులను ముంచేసి లండన్‌ చెక్కేసి అక్కడ తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.

వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని చెల్లించకుండా బ్యాంకులను మోసం చేయడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలతో ప్రస్తుతం మాల్యాపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతుండగా.. ఈ దర్యాప్తును తప్పించుకునేందుకు 2016 మార్చిలో విజయ్ మాల్యా లండన్ వెళ్లిపోయారు.

మాల్యాను తిరిగి అప్పగించాలంటూ…

ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాను తిరిగి తమ దేశానికి అప్పగించాలంటూ భారత ప్రభుత్వం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించాలంటూ కోర్టు సోమవారం ఆదేశించింది.

అంతేకాదు, ఈ కేసులో ఇచ్చిన తీర్పులో వెస్ట్‌మినిస్టర్ కోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ మాల్యా ఐడీబీఐ బ్యాంకుకు తప్పుడు పత్రాలు సమర్పించారని, వాస్తవాలను వక్రీకరించి రుణాలు పొందారంటూ ఆయన పేర్కొన్నారు.

లండన్ కోర్టు తీర్పుతో విజయ్ మాల్యా అప్పగింత కేసులో భారత దేశం దౌత్యపరమైన విజయం సాధించినట్లయింది. భారత ప్రభుత్వ అభ్యర్థనపై వెస్ట్‌మినిస్టర్ కోర్టు 2017 డిసెంబరు 4 నుంచి విచారణ జరుపుతోంది. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ఈ కేసును దర్యాప్తు చేసింది.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చతికిలబడటం అనివార్యమని మాల్యాకు ముందే తెలుసునని, బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించాలనే ఉద్దేశం మాల్యాకు ఎప్పుడూ లేదని దర్యాప్తు నివేదికలో పేర్కొంది.

మానవ హక్కులకు సంబంధించిన కారణాలను చూపుతూ విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించేందుకు ఎటువంటి అడ్డంకులు కూడా లేవని వెల్లడించింది. అయితే ఈ తీర్పుపై 14 రోజుల్లోగా అప్పీల్‌ చేసుకొనేందుకు మాల్యాకు కోర్టు అవకాశం ఇచ్చింది.

- Advertisement -