

విజయవాడ: నగరంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది బెనర్జీపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి ఆయన్ని విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. అంతేకాదు, అలా పారిపోతూ ఆ ముగ్గురు వ్యక్తులు కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మూడో వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
నిందితులు ముగ్గురు ఓ సివిల్ కేసు గురించి మాట్లాడేందుకు సోమవారం ఉదయం న్యాయవాది బెనర్జీ వద్దకు వచ్చారు. తమ సమస్య గురించి ఆయనకు చెప్పారు. దీంతో బెనర్జీ వారితో ఒక అంగీకారానికి వచ్చారు. ఆ తరువాత బెనర్జీ తన కారులోనే ఆ ముగ్గురితో కలసి జీ కొండూరు మండలం హెచ్ ముత్యాలంపాడు గ్రామానికి బయలుదేరారు.
కారులోంచి దిగి బైక్‌పై పరార్…
అయితే మార్గం మధ్యలో వారి మధ్య ఏ విషయంలో వివాదం తలెత్తిందో తెలియదుగానీ, ఆ ముగ్గురు వ్యక్తులూ న్యాయవాది బెనర్జీపై కత్తులతో దాడికి దిగారు. ఆయన్ని ఇష్టానుసారం పొడిచారు. భయంతో బెనర్జీ కేకలు వేయగా, అతడి అరుపులు విన్న గ్రామస్తులు పరుగున అక్కడికి వచ్చారు. దీంతో నిందితులు ముగ్గురూ కారులోంచి కిందికి దిగి దగ్గర్లో ఉన్న ఓ బైక్‌పై పరారయ్యారు.
తమను ఎవరైనా వెంబడిస్తారేమో అన్న భయంతో వారు విపరీతమైన వేగంతో బైక్‌ను నడుపుకుంటూ వెళ్లడంతో, భీమవరం పాడు వద్ద బైక్ అదుపుతప్పి ఓ చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో నిందితుల్లో ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరొక వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.
మరోవైపు వారి చేతిలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన న్యాయవాది బెనర్జీని స్థానికులు పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ప్రాణాలతో మిగిలిన మూడో నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.








