హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, అటు ఎరవెల్లి గ్రామంలోనూ.. ఇటు చింతమడకలోనూ ఆయనకు ఓటు హక్కు ఉందని, ఇదెలా సాధ్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమని, మరి నిబంధనలకు వ్యతిరేకంగా రెండు చోట్ల ఓటుహక్కు కలిగి ఉన్న కేసీఆర్‌పై ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వ్యతిరేక ఓటర్లను పకడ్బందీగా తొలగించారు…
ఆదివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసే వారి ఓట్లను బూత్ స్థాయి నుండి ప్రభుత్వం పకడ్బందీగా తొలగించిందని ఆరోపించారు. చాలామందికి ఓటు హక్కు లేకుండా చేసి, తాను మాత్రం రెండు చోట్లు ఓట్లు ఉంచుకోవడం మీకు న్యాయమేనా? అని కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.
దాదాపు అర్హులైన 20 లక్షల మంది ఓటర్లను.. జాబితా నుంచి తొలగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మౌనం వహిస్తోంది? అని ఆయన ప్రశ్నించారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ అయితే దీనిపై ‘సారీ’తో సరిపెట్టేశారని, ఇలాగేనా ఎన్నికల నిర్వహించేది అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అంతేకాదు, పోలింగ్ అనంతరం ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఎన్నికల అధికారులకు అభినందనలు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. బహుశా ఆయన తన తండ్రి కేసీఆర్‌కు రెండు చోట్లు ఓటు హక్కు కల్పించడంపై ఎన్నికల అధికారులను అభినందించి ఉంటారంటూ ఎద్దేవా చేశారు.
ఓట్ల గల్లంతుపైనా పదేపదే ఫిర్యాదు చేసినా ఎన్నికల అధికారులు పట్టించుకోకపోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. అసలు ముందు రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న కేసీఆర్‌పైన, ఇందుకు బాధ్యులైన అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.