

శాన్‌ఫ్రాన్సిస్కో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి షాక్ తగిలింది. మెక్సికో సరిహద్దు నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తోన్న వలసదారుల్ని నిషేధిస్తూ ఆయనిచ్చిన ఉత్తర్వులపై దిగువకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు 9వ యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ నిరాకరించింది.
ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు ప్రసుత్తమున్న అమెరికా చట్టాలకు అనుగుణంగా లేవనీ, సాక్షాత్తూ కాంగ్రెస్‌ను విస్మరించేలా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.
అమెరికా–మెక్సికో సరిహద్దు ద్వారా ఆశ్రయం కోరుతూ వలస దారులు దేశంలోకి రావడాన్ని ట్రంప్ గత నెల 9న నిషేధించారు. అయితే దీనిపై కింది కోర్టు స్టే విధించింది. దీంతో ఈ స్టేను ఎత్తివేయాల్సిందిగా ట్రంప్ ప్రభుత్వం అప్పీల్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా అప్పీల్స్ కోర్టు ట్రంప్ ప్రభుత్వ చర్యనే తప్పుబట్టింది.
చట్టాలను కోర్టు గదుల నుంచి, ఓవల్ (అధ్యక్ష) కార్యాలయం నుంచి చేయలేరంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఓ వ్యక్తి అమెరికాలోకి ఎలా ప్రవేశించాడన్న ఆధారంగా అతిడిపై నిషేధం విధించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను 2-1 మెజారిటీతో అప్పీల్స్ కోర్టు తోసిప్చుంది.








