
హైదరాబాద్: ‘కరోనా’ సెకండ్ వేవ్ స్పీడ్ గమనించారా? ఆర్టీపీసీఆర్ టెస్టులు స్లోగా పెంచడం ఏంటి? జన సమ్మర్థం అధికంగా ఉండే చోట్ల ఎలాంటి ఆంక్షలు విధించకపోవడం ఏంటి? అంటూ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి, కట్టడి చర్యలపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలు, పరీక్షలు, చికిత్సలపై అడ్వకేట్ జనరల్ నివేదిక సమర్పించారు.
అయితే దీనిని పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పూర్తిగా ర్యాపిడ్ టెస్టులపైనే ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని, ఆర్టీపీసీఆర్ టెస్టులు 10 శాతం కూడా లేవంటూ వ్యాఖ్యానించింది.
‘‘సెకండ్ వేవ్ స్పీడ్ గమనించారా?’’
ఈ దశలో అడ్వకేట్ జనరల్ కల్పించుకుని ఆర్టీపీసీఆర్ టెస్టులు నెమ్మదిగా పెంచుతున్నామని చెప్పగా.. ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ స్పీడ్ గమనించారా? అని ప్రశ్నించింది.
అది అంత స్పీడుగా వ్యాపిస్తోంటే.. మీరు ఆర్టీపీసీఆర్ టెస్టులు నెమ్మదిగా పెంచుతామని చెప్పడం ఏంటని అసహనం వ్యక్తం చేసింది. జనం ఎక్కువగా గుమిగూడే బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు విధించలేదని ప్రశ్నించింది.
తక్షణమే ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని, వివాహాలు, అంత్యక్రియలు వంటి సందర్భాల్లో జనం అధికంగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది.
కరోనా పాజిటివ్, మరణాల రేటు వెల్లడించాలని, రాష్ట్రంలో కరోనా చికిత్సా కేంద్రాల గురించి విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది.
అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జన సమ్మర్థం అధికంగా ఉండే ఇతర ప్రదేశాలలో నిర్వహిస్తోన్న పరీక్షల వివరాలు కూడా తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. అనాధ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది.
కరోనా నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, నిబంధనలు పాటించని వారిపై నమోదైన కేసులు, విధించిన జరిమానాలు తదితర విషయాలు వివరిస్తూ 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.







