
న్యూఢిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానం పీఠాన్ని అధిరోహించే అవకాశం తాజాగా ఒక తెలుగు తేజానికి దక్కింది. అవును, సుప్రీంకోర్టు 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఈ మేరకు ప్రతిపాదించగా.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.
మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మర్నాడే అంటే ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సాధారణ రైతు కుటుంబంలో జన్మించి…
ఆయన 2022 ఆగస్టు 26 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత సీజేఐ బోబ్డే తరువాత సుప్రీంకోర్టులో ఎన్వీ రమణ అత్యంత సీనియర్ న్యాయమూర్తి.
ఎన్వీ రమణ 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించిన ఆయన 2000 సంవత్సరం జూన్‌లో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
తరువాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి నెలలో భారత సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
అప్పట్నించి సుప్రీంకోర్టు జస్టిస్‌గా వ్యవహరిస్తోన్న ఆయన తాజాగా తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎంపికయ్యారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి సీజేఐ స్థాయికి జస్టిస్ ఎన్వీ రమణ ఎదగడం నిజంగా తెలుగు వారికి గర్వకారణమే.







