‘కరోనా’ డేంజర్ బెల్స్: ఒక్కరోజులో లక్షకుపైగా కేసులు.. అమెరికా తర్వాత మనమే టాప్!

- Advertisement -

న్యూఢిల్లీ: అనుకున్నంతా అయింది. అగ్రదేశం అమెరికా తరువాత ఆ స్థానంలో మనమే నిలిచాం. కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల్లో మన దేశం ప్రపంచంలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

సెకండ్ వేవ్ కరోనా మరింత ప్రమాదకరం అని ఇటు వైద్యరంగ నిపుణులు, అటు ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా సామాన్య జనానికి అర్థం కావడం లేదు.

తాజాగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కరోజులో లక్ష దాటింది. గడిచిన 24 గంటల్లో 1,03,558 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 478 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ఒక్క రోజులో లక్షకుపైగా కరోనా కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ నిలిచింది. వీటిలో సగానికి పైగా కేసులు ఒక్క మహారాష్ట్ర నుంచే నమోదు అవడం గమనార్హం.

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ మన దేశంలోకి అడుగుపెట్టిన రోజు.. దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయిన రోజు.. జనవరి 30, 2020.

ఆ తరువాత అది దేశంలోని అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది. రోజూ పదులు, వందలు, వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అమెరికా తర్వాత మనమే…

ప్రపంచంలో ఒక్క రోజు వ్యవధిలో లక్షకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన మొట్టమొదటి దేశం అమెరికా. ఈ ఏడాది జనవరి 8న అక్కడ 3.08 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఆ తరువాత ఈ రేసులో మన దేశమే టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మన దేశంలో 1.03 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అమెరికా, భారత్ మినహా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇప్పటి వరకు ఒక్క రోజు వ్యవధిలో లక్ష కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 1.25 కోట్లు దాటింది. కరోనా బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 1.16 కోట్ల మంది వైరస్ నుంచి బయటపడగా.. ఇంకా 7.41 లక్షల మంది దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో, ఇళ్లల్లో చికిత్స పొందుతున్నారు.

నెల రోజుల్లోనే ఆరు రెట్లు…

కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో విజృంభిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నాటి పరిస్థితి మళ్లీ ఇప్పుడు రిపీట్ అయింది. అప్పట్లో రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువకాగా.. ఇప్పుడు ఏకంగా లక్షను దాటిపోయింది.

గత ఏడాది సెప్టెంబర్ 16న మన దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 97,894 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మళ్లీ ఇప్పుడు, అంటే.. 2021 ఏప్రిల్ 3న 1.03 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

నెల రోజుల క్రితం కూడా పరిస్థితి మరీ ఇంత ఘోరంగా లేదు. రోజువారీ పాజిటివ్ కేసులు 15-16 వేల మధ్యలోనే ఉండేవి. ఒక్క నెల రోజుల వ్యవధిలో ఈ కేసుల సంఖ్య 6 రెట్లు పెరగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం.

అయితే కొంతలో కొంత ఊరట కలిగించే అంశం ఏమిటంటే.. మరణాల సంఖ్య గతంలో పోల్చితే తక్కువగా ఉండడం. గత ఏడాది సెప్టెంబర్ నెలలో రోజువారి మరణాల సంఖ్య వెయ్యికి పైగానే నమోదు అయ్యాయి.

సెప్టెంబర్ 15న కరోనా బారిన పడి అత్యధికంగా 1,283 మంది మరణించారు. ఆ పరిస్థితితో పోల్చుకుంటే ఇప్పుడు కొంత నయం. గడిచిన 24 గంటల్లో 478 మంది ఈ వైరస్‌కు బలయ్యారు.

కొంప ముంచనున్న నిర్లక్ష్యం!

ప్రస్తుతం దేశంలో వ్యాపిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరమని ఇటు ప్రభుత్వాలు, ఇటు వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే సాధారణ ప్రజానీకం మాత్రం ఇవేవీ లక్ష్యపెట్టనట్లు కనిపిస్తున్నారు.

ఇదిలాగే కొనసాగితే కొంప మునగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక వైపు కరోనా వ్యాక్సిన్ వచ్చిందనే భరోసా. వ్యాక్సిన్ వేయించుకున్న వారైతే ఏకంగా కరోనా నిబంధనలు పాటించడమే మానేశారు.

ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని వారిలోనూ అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. మాస్కు లేకుండానే తిరగడం, చేతులు తరచూ శానిటైజ్ చేసుకోవాలనే విషయం మరిచిపోవడం.. అన్నిటికీ మించి సామాజిక దూరం పాటించకపోవడం.

ఇవీ ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ విజృంభణకు కీలకమైన కారణాలు. వీటితోపాటు ప్రభుత్వాలు కూడా కరోనా వచ్చిన కొత్తలో తీసుకున్నంత స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి.

క్షేత్ర స్థాయిలో కంటైన్‌మెంట్ ప్రాంతాలను గుర్తించి అవసరమైన నిబంధనలు అమలు చేయడంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

 

- Advertisement -