పంజాబ్‌లో రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం

- Advertisement -

లుధియానా: రేపటి (ఏప్రిల్ 1) నుంచి పంజాబ్‌లో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు.

సీఎం చేసిన ఈ ప్రకటనతో రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలు/బాలికలు లబ్ధి పొందనున్నారు. మహిళలకు అందుబాటులోకి రానున్న ఈ సరికొత్త పథకం గురించి ముఖ్యమంత్రి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఒక ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ‘‘ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తూ ముందుకు తెచ్చిన ప్రతిపాదనకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం పొందడం హర్షణీయం.

మహిళా సాధికారతకు ఇది బలమైన అడుగు అని నేను భావిస్తున్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు.

కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మహిళా సాధికారతకు ప్రభుత్వం తీసుకున్న గొప్ప ముందడుగు ఇదంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.

కాగా, ప్రభుత్వ ఉచితం పథకం ద్వారా ఖజానాపై మరింత భారం పడుతుందని అంటున్నారు.

- Advertisement -