హైదరాబాద్: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కరోనా బారిన పడ్డారు. ఆయన ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకున్నారని, అయినప్పటికీ ఆయనకు కోవిడ్ సోకిందనే వార్తలు గుప్పుమన్నాయి.
అయితే దీనిపై అల్లు అరవింద్ ఓ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. అసలేం జరిగిందో వివరించారు. తనకు కరోనా వైరస్ సోకిన మాట వాస్తవమేనని, తాను ఇప్పుడు ‘కరోనా పాజిటివ్’ అని ఆయన పేర్కొన్నారు.
అయితే తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ, ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకున్నా తనకు కరోనా వచ్చిందని, తీవ్ర అస్వస్థతకు గురయ్యానంటూ వస్తోన్న పుకార్లు అవాస్తవం అన్నారు.
అసలేం జరిగిందంటే…
వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తరువాత తాను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ ఊరికి వెళ్లానని, ఆ తరువాత తమ ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు.
‘‘అయితే ముగ్గురిలో ఇద్దరం సేఫ్‌గా ఉన్నాం.. మూడో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మేం ఇద్దరం సేఫ్‌గా ఉండడానికి కారణం.. మేం కరోనా వ్యాక్సిన్ డోస్ తీసుకున్నాం. ఆయన మాత్రం తీసుకోలేదు..’’ అని ఆ సెల్ఫీ వీడియోలో అల్లు అరవింద్ వివరించారు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా వస్తుందనేది కేవలం అపోహ మాత్రమేనని, ఒకవేళ వచ్చినా అది వ్యాక్సిన్ వేయించుకున్న వారిని ఏమీ చేయలేదని, అందుకు తానే ఉదాహరణ అని చెప్పారు.
వ్యాక్సిన్ వేయించుకోకపోవడం వల్లే తమ స్నేహితుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి వచ్చిందని, వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారిలో యాంటీబాడీలు అధికంగా ఉంటాయని, కాబట్టి కరోనా సోకినా కూడా ఏమీ చేయలేదని అరవింద్ చెప్పుకొచ్చారు.